Pant: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా మళ్లీ విఫలం.. ఇతన్ని టీమిండియా కెప్టెన్‌ చేయాలట..!

20 Nov, 2022 13:14 IST|Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 20) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే వాతావవరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లుగానే వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం మొదలయ్యే సమయానికి (6.4 ఓవర్ల తర్వాత) టీమిండియా వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ (6) మరోసారి నిరాశపర్చగా.. ఇషాన్‌ కిషన్‌ (28), సూర్యకుమార్‌ యాదవ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన మళ్లీ విఫలమైన పంత్‌..
న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20, వన్డే జట్లకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్‌ పంత్‌ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో తనను తాను ప్రూవ్‌ చేసుకోలేకపోతున్నాని వాపోతున్న పంత్‌ను మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపింది. అయితే పంత్‌ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. ఒక్క బౌండరీ బాది, ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చినా మళ్లీ విఫలం కావడంతో అతని ఫ్యాన్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఎప్పుడయ్యా నువ్వు ఆడేది అంటూ వాపోతున్నారు. పంత్‌ అంటే సరిపడిని వాళ్లయితే ఒకింత డోస్‌ పెంచి.. ఇచ్చిన అవకాశాలన్నీ నిర్లక్ష్యపు ఆటతో చేజార్చుకుంటున్న ఇతన్ని టీమిండియా కెప్టెన్‌ చేయాలట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

ముందు ఇతన్ని జట్టు నుంచి తప్పించి, వికెట్‌కీపర్‌గా శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరికి అవకాశం కల్పించాలని సెలెక్టర్లను కోరుతున్నారు. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు ఇవ్వలేదని, పక్కకు పెడితే తప్ప ఇతను దారిలోకి రాడని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పంత్‌ వ్యతిరేక పోస్ట్‌లతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తుతుంది. కాగా, మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశం కొత్తగా తెరపైకి రావడంతో టెస్ట్‌ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌ చేయాలని అతని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు