IND VS NZ 2nd T20: సూర్యకుమార్‌ సుడిగాలి శతకం.. సౌథీకి హ్యాట్రిక్‌, చరిత్రలో తొలిసారి ఇలా..

20 Nov, 2022 14:42 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో రెండో సెంచరీ బాదాడు. సూర్యకుమార్‌ ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సూర్యకుమార్‌ ఊచకోత ధాటికి న్యూజిలాండ్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే టిమ్‌ సౌథీ మాత్రం సూర్యను కంట్రోల్‌ చేస్తూ.. తన కోటా 4 ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. సౌథీకి ఇది టీ20ల్లో రెండో హ్యాట్రిక్‌. ఈ ఫీట్‌ను గతంలో శ్రీలంక యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ మాత్రమే సాధించాడు. 

కాగా, సౌథీ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్ మూడో బంతికి హార్ధిక్‌ (13), నాలుగో బంతికి హుడా (0), ఐదో బంతికి సుందర్‌ (0)లను పెవిలియన్‌కు పంపి టీ20 కెరీర్‌లో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. సౌథీ మినహా మిగతా బౌలర్లందరినీ సూర్యకుమార్‌ ఓ ఆట ఆడుకున్నాడు. ఫెర్గూసన్‌ 2 వికెట్లు, సోధీ ఒక వికెట్‌ పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

భారత ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ సెంచరీతో శివాలెత్తగా.. ఇషాన్‌ కిషన్‌ (36) ఓ మోస్తరుగా రాణించాడు. ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (13) నిరాశపరిచారు. అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. రెండో బంతికే ఫిన్‌ అలెన్‌ (0)ను భవనేశ్వర్‌ కుమార్‌ పెవిలియన్‌కు పంపాడు, అర్షదీప్‌ క్యాచ్‌ అందుకోవడంతో అలెన్‌ ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఒకే మ్యాచ్‌లో (టీ20ల్లో) సెంచరీ, హ్యాట్రిక్‌ నమోదయ్యాయి. క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సూర్యకుమార్‌ సెంచరీతో.. టిమ్‌ సౌథీ హ్యాట్రిక్‌తో చెలరేగారు. 


 

మరిన్ని వార్తలు