IND VS NZ 3rd ODI: మళ్లీ నిరాశపర్చిన పంత్‌.. కెప్టెన్‌, కోచ్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్‌

30 Nov, 2022 09:44 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. న్యూజిలాండ్‌ బౌలర్లు ఆడమ్‌ మిల్నే (3 వికెట్లు), ఫెర్గూసన్‌ (1), డారిల్‌ మిచెల్‌ (1) ధాటికి టీమిండియా 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. గిల్‌ (13), ధవన్‌ (28), పంత్‌ (10), సూర్యకుమార్‌ యాదవ్‌ (6) దారుణంగా విఫలం కాగా, శ్రేయస్‌ అయ్యర్‌ (49) పర్వాలేదనిపించాడు. దీపక్‌ హుడా (3), వాషింగ్టన్‌ సుందర్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. 28 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 131/5గా ఉంది. 

కాగా, ఈ మ్యాచ్‌లోనూ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ వైఫల్యాల పరంపర కొనసాగడం టీమిండియా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా పంత్‌ మారేది లేదు.. తక్షణమే అతన్ని జట్టు నుంచి తప్పించాలని ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. పనిలోపనిగా పంత్‌ను వెనకేసుకొస్తున్న జట్టు మేనేజ్‌మెంట్‌ను దుయ్యబట్టారు. ఇకనైనా మీ ఒంటెత్తు పోకడలు ఆపుతారా లేక పంత్‌ను జట్టులో శాశ్వత సభ్యుడిగా కొనసాగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అడిగే వారు లేరని వరుసగా విఫలమవుతున్నా పంత్‌కు వరుస ఛాన్స్‌లు ఇస్తున్నారు.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌కు మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ అన్యాయం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. మూడో వన్డేలో పంత్‌ వైఫల్యం చెందడంతో అతనిపై విమర్శనాస్త్రాలతో సోషల్‌మీడియా హోరెత్తుతుంది. పంత్‌కు వ్యతిరేకంగా, సంజూ శాంసన్‌కు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. ఈ విషయంలో బీసీసీఐ, జట్టు మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌, కోచ్‌ల వైఖరిని ఎండగడుతున్నారు.  


 

మరిన్ని వార్తలు