IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్‌

30 Nov, 2022 13:16 IST|Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌లో జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ.. సోషల్‌మీడియాలో ఓ మినీ సైజ్‌ ఉద్యమమే నడుస్తుంది. పంత్‌ వరుసగా విఫలమవుతున్నా వరుస అవకాశాలు కల్పిస్తూ అతన్ని వెనకేసుకొస్తున్న బీసీసీఐపై సైతం ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.

టీమిండియాలో చోటుకు అన్ని విధాల అర్హుడైన సంజూ శాం‍సన్‌కు అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టి, పంత్‌కు వరుస ఛాన్స్‌లు కల్పించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు జట్టు యాజమాన్యాన్ని, కోచ్‌, కెప్టెన్లను గట్టిగా నిలదీస్తున్నారు. 

ఇదే అంశంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. రిషబ్‌ పంత్‌నే డైరెక్ట్‌గా క్వశ్చన్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకి ముందు పంత్‌తో మాట్లాడుతూ.. పేలవ ఫామ్‌పై ఇబ్బందికర ప్రశ్నలు సంధించాడు. 

హర్షా భోగ్లే: గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా ఇదే ప్రశ్న ఆడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే మీ టెస్ట్‌ మ్యాచ్‌ల రికార్డు బాగా ఉంది. దీనిపై మీరేమంటారు..?

పంత్‌: సర్‌.. రికార్డులనేవి కేవలం నంబర్లు మాత్రమే. అయినా నా వైట్‌ బాల్‌ గణాంకాలు కూడా ఏమంత చెత్తగా లేవని నేననుకుంటాను.

హర్షా భోగ్లే: నా ఉద్దేశం మీ వైట్‌ బాల్‌ గణాంకాలు బాగాలేవని కాదు.. టెస్ట్‌ రికార్డులతో పోలిస్తే.. అవి కాస్త నార్మల్‌గా ఉన్నాయన్నదే నా ఉద్దేశం.

పంత్‌: సర్‌.. కంపారిజన్‌ అనేది నా లైఫ్‌లో పార్ట్‌ కాదు.. ఇప్పుడు నాకు 25, 30-32 ఏళ్లు వచ్చాక మీరు ఇలా చేస్తే ఓ అర్ధం ఉంటుందంటూ అసహనంగా సమాధానం చెప్పాడు. 

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పంత్‌ మూడో వన్డేలోనూ విఫలం కావడంతో నెటిజన్లు అతన్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఏదైనా ఉంటే బ్యాట్‌తో సమాధానం చెప్పాలి.. కరెక్ట్‌గా ప్రశ్నించినప్పుడు అంత అసహనం ఎందుకని నిలదీస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు