IND VS NZ 3rd ODI: అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్న గిల్‌.. మరో మెరుపు సెంచరీ

24 Jan, 2023 15:52 IST|Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచే పరుగుల వరద పారిస్తున్న గిల్‌.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో నుంచి ధనాధన్‌ ఇన్నింగ్స్‌లకు శ్రీకారం చుట్టాడు. అప్పటివరకు స్లోగా ఆడతాడు అన్న ముద్రను గిల్‌ ఈ మ్యాచ్‌తో చెరిపేశాడు. లంకతో తొలి వన్డేలో మెరుపు హాఫ్‌ సెంచరీ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) చేసిన గిల్‌.. ఆతర్వాతి మ్యాచ్‌లో 21 పరుగులకే ఔటైనప్పటికీ, మూడో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు.

ఆ మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఇంతటితో ఆగని గిల్‌ మేనియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో గిల్‌ ఏకంగా డబుల్‌ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఇంతటితో సంతృప్తి చెందని ఈ పంజాబ్‌ యువకెరటం.. రెండో వన్డేలో అజేయమైన 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంత చేశాక కూడా గిల్‌ పరుగుల దాహం తీరలేదు. ఇవాళ (జనవరి 24) ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మరో విధ్వంసకర శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌.. 72 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ (103 పరుగులు) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ షాట్లు ఆడే విధానం, అతని ఫామ్‌ చూసి ఈ మ్యాచ్‌లో కూడా డబుల్‌ సెంచరీ బాదడం ఖాయమని అంతా ఊహించారు. అయితే గిల్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి టిక్నర్‌ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి 112 (78; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల వద్ద ఔటయ్యాడు.

వన్డే కెరీర్‌లో 4వ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో రోహిత్‌ సైతం విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాదాపు 17 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో సెం‍చరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతులను ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌కు వన్డేల్లో ఇది 30వ సెంచరీ కాగా, అన్ని ఫార్మట్లలో కలిపితే 42వది. రోహిత్‌, గిల్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి (25), ఇషాన్‌ కిషన్‌ (12) కూడా ధాటిగా ఆడుతుండటంతో టీమిండియా స్కోర్‌ 33 ఓవర్ల తర్వాత 260/2గా ఉంది.  

మరిన్ని వార్తలు