IND Vs NZ 3rd T20: రాహుల్‌ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్‌.. ఔటయ్యాక బాధ వర్ణణాతీతం

1 Feb, 2023 20:00 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మెప్పించిన టీమిండియా వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నది కొద్దిసేపే అయినా త్రిపాఠి ఆడిన ఇన్నింగ్స్‌ను జనాలు మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. అయితే త్రిపాఠి వేగంగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేద్దామనే తొందరలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఐష్‌ సోధీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన త్రిపాఠి ఔటైన అనంతరం చాలా బాధపడ్డాడు. ఫెర్గూసన్‌ క్యాచ్‌ పట్టగానే అతను కోపం కట్టలు తెంచుకుంది. బౌండరీ లైన్‌ క్లియర్‌ చేయలేనందుకు తనను తానే దూషించుకన్నాడు. బ్యాట్‌ను పలు మార్లు నేలకేసి కొట్టేలా కనిపించాడు. భారీ ఇన్నింగ్స్‌ ఆడదామనుకున్న కలలు కల్లలుగానే మిగిలిపోవడంతో త్రిపాఠి బాధ వర్ణణాతీతంగా ఉండింది. ఈ సందర్భంగా అతను ప్రదర్శించిన హావభావాలు, అతని మనసులోని బాధను టీమిండియా అభిమానులు అర్ధం చేసుకుని మద్దతుగా నిలిచారు. 

కాగా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఒక్క పరుగుకే ఇషాన్‌ కిషన్‌ ఔట్‌ కాగా.. త్రిపాఠి మెచ్చుకోదగ్గ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. గిల్‌ (36 బంతుల్లో 51; 7 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (11 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) మెరుపులు మెరిపిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 118/2గా ఉంది.  

   

మరిన్ని వార్తలు