IND VS NZ 3rd T20: ఇక మారవా..? మరోసారి చెత్త షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్న రిషబ్‌ పంత్‌

22 Nov, 2022 15:26 IST|Sakshi

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 22) జరుగుతున్న సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (4/17), అర్షదీప్‌ సింగ్‌ (4/37), హర్షల్‌ పటేల్‌ (1/28) చెలరేగడంతో న్యూజిలాండ్‌ తమ కోటా 20 ఓవర్లు ఆడకుండానే 160 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. ఆరంభంలోనే 2 వికెట్లు (ఫిన్‌ అలెన్‌ (3), మార్క్‌ చాప్‌మన్‌ (12))  కోల్పోయినా, డెవాన్‌ కాన్వే (59), గ్లెన్‌ ఫిలిప్స్‌ (54) జట్టును ఆదుకున్నారు. అయితే వీరిద్దరు 16 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ పతనం ఆరంభమైంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటర్‌​ నిలదొక్కుకోలేకపోయారు.  ఏకంగా ముగ్గురు (నీషమ్‌, మిల్నే, సోధి) డకౌట్‌లు అయ్యారు. డారిల్‌ మిచెల్‌ (10) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. 

అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్‌ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్‌ మిల్నే (1/23) ధాటికి 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను (10) మిల్నే ఔట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ (11), శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను సౌథీ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 58/3గా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (12), హార్ధిక్‌ పాండ్యా (23) క్రీజ్‌లో ఉన్నారు.

పంత్‌.. ఇక మారవా..?
టీమిండియా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కమ్‌ వైస్‌ కెప్టెన్‌ అయిన రిషబ్‌ పంత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేక మరోసారి చెత్త షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. టిమ్‌ సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రెండు, మూడు బంతులకు వరుసగా బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్‌.. ఆతర్వాతి బంతికే అనవసరపు షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు.

ఆ ఓవర్‌లో అప్పటికే రెండు ఫోర్లు వచ్చినా సంతృప్తి చెందక.. సౌథీపై ఎటాకింగ్‌ చేద్దామని వెళ్లి వికెట్‌ సమర్పించుకున్నాడు. సౌథీ వేసిన షార్ట్‌ బాల్‌ను అంచనా వేయలేక క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చి థర్డ్‌ మెన్‌లో ఉన్న సోధికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. పంత్‌.. రెండో టీ20లోనూ ఇదే తరహాలో చెత్త షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

పంత్‌.. ఇక మారవా..? అంటూ చీదరించుకుంటున్నారు. మరికొంత మంది అయితే పంత్‌ను తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ ఇవ్వలేదని.. బీసీసీఐకి, సెలెక్టర్లకు పంత్‌పై ఎందుకు ఇంత ప్రేమ అని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను పక్కకు పెట్టి, పంత్‌కు వరుస అవకాశాలు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు.    

మరిన్ని వార్తలు