Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!

1 Feb, 2023 11:04 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI)

India vs New Zealand, 3rd T20I- Predicted Playing XI: టీ20 సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని హార్దిక్‌ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. 1955 నుంచి ఏ ఫార్మాట్‌లో కూడా భారత గడ్డపై సిరీస్‌ గెలవలేకపోయిన కివీస్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం జరుగనున్న మూడో టీ20 మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఉమ్రాన్‌ వద్దు
యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20 ఫార్మాట్‌లో మరింత రాటుదేలాల్సి ఉందన్న వసీం.. అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌నే మూడో టీ20లోనూ కొనసాగించాలని సూచించాడు. అదే విధంగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను తప్పించాలని.. అతడి స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని విజ్ఞప్తి చేశాడు.

‘‘న్యూజిలాండ్‌ బ్యాటర్లు.. స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. టీమిండియాకు చహల్‌ లాంటి అద్భుతమైన స్పిన్నర్‌ అందుబాటులో ఉన్నపుడు తప్పక అతడి సేవలు వినియోగించుకోవాలి.

గతంలో నేను.. చెప్పినట్లుగానే ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంకా పొట్టి ఫార్మాట్‌లో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. పేస్‌లో వైవిధ్యం చూపిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలడు. కాబట్టి మూడో టీ20లోనూ చహల్‌ను కొనసాగించాలి. అతడే బెటర్‌ ఆప్షన్‌’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ వసీం జాఫర్‌ వ్యాఖ్యానించాడు.

పృథ్వీ షాను తీసుకురండి
అదే విధంగా.. ‘‘టీమిండియా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో పృథ్వీ షాను తీసుకురావాలి. టీ20 క్రికెట్‌లోనూ అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠిల విషయంలో మాత్రం నాకెలాంటి ఆందోళనా లేదు’’ అని జాఫర్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా కివీస్‌తో వన్డేలో సిరీస్‌లో డబుల్‌ సెంచరీ, శతకంతో చెలరేగిన గిల్‌.. టీ20లలో మాత్రం జోరు చూపించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 7, 11 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న పృథ్వీ షా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. 

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మూడో టీ20
తుది జట్ల అంచనా
భారత్‌: శుబ్‌మన్‌ గిల్‌/పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌పాండ్యా(కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే(వికెట్‌ కీపర్‌), మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), ఇష్‌ సోది, జాకోబ్‌ డఫీ, లాకీ ఫెర్గూసన్‌, బ్లేయిర్‌ టిక్నర్‌.

చదవండి: Nitish Rana: నెగెటివ్‌ ట్వీట్‌ను లైక్‌ చేసిన క్రికెటర్‌.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు 
KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్‌ మొదలైంది

మరిన్ని వార్తలు