కివీస్‌తో మూడో టీ20లో గిల్‌ సెంచరీ.. రికార్డుల రారాజు కోహ్లి రికార్డుకే ఎసరు

1 Feb, 2023 21:15 IST|Sakshi

IND VS NZ 3rd T20I: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో బ్లాస్టింగ్‌ హండ్రెడ్‌తో పేలిన టీమిండియా యంగ్‌ డైనమైట్‌ శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 126 నాటౌట్‌; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్‌లో తన తొట్టతొలి శతకం నమోదు చేసిన గిల్‌.. కోహ్లి రికార్డుకు పంగనామం పెట్టడంతో పాటు మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేందుకు 35 బంతులు ఆడిన గిల్‌.. సెంచరీ కంప్లీట్‌ చేసేందుకు మరో 19 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. 23 ఏళ్ల గిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ ఫీట్‌ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్‌ క్రికటర్‌ రికార్డు కూడా గిల్‌ ఖాతాలోనే చేరింది.  

అలాగే న్యూజిలాండ్‌పై టీమిండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక స్కోర్‌ (208, 126 నాటౌట్‌) చేసిన ఆటగాడిగానూ గిల్‌ రికార్డు నెలకొల్పాడు. వీటితో పాటు గిల్‌ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడు గిల్‌ రికార్డు సృష్టించాడు. గిల్‌కు ముందు ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌) పేరిట​ ఉండేది. 

కాగా, ఈ మ్యాచ్‌లో గిల్‌ సుడిగాలి శతకానికి  రాహుల్‌ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాం‍డ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు.

కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్‌, టిక్నర్‌, సోధీ, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 235 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 2.4 ఓవర్లలో కేవలం 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలి ఓవర్‌లోనే హార్ధిక్‌.. ఫిన్‌ అలెన్‌ (3) పెవిలియన్‌కు పంపగా.. రెండో ఓవర్‌లో అర్షదీప్‌ కాన్వే (1), చాప్‌మన్‌ (0)లను, ఆ వెం‍టనే మూడో ఓవర్‌లో హార్ధిక్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (2)ను ఔట్‌ చేశాడు. 
 

మరిన్ని వార్తలు