Rishabh Pant: సుందర్‌ను ప్రశంసిస్తూనే.. పంత్‌ను వెనకేసుకొచ్చిన మాజీ క్రికెటర్‌! 3 ఫిఫ్టీలు ఉన్నా..

25 Nov, 2022 13:12 IST|Sakshi

New Zealand vs India, 1st ODI- Washington Sundar- Rishabh Pant: ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ ఆట తీరు అమోఘం. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా.. భారత యువ ఆల్‌రౌండర్‌పై ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్‌ ఆడి తనదైన ముద్ర వేశాడని కొనియాడాడు. 

మెరుపు ఇన్నింగ్స్‌
కాగా కివీస్‌తో మొదటి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు(స్ట్రైక్‌రేటు 231.25) సాధించాడు. టీమిండియా స్కోరు 300 మార్కు దాటడంలో తన వంతు పాత్ర పోషించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

ఇక టాపార్డర్‌లో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ 72, శుబ్‌మన్‌ గిల​ 50 పరుగులు చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 80 పరుగులతో అదరగొట్టాడు. వీరికి తోడు సంజూ శాంసన్‌ 36, వాషీ 37 పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వారెవ్వా సుందర్‌
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘టీమిండియా ఇన్నింగ్స్‌లో మూడు 50+ స్కోర్లు ఉన్నప్పటికీ సుందర్‌ మెరుపు ఇన్నింగ్సే ఎక్కువ ప్రభావంతమైనదని చెప్పవచ్చు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అతడు ఏ మేరకు స్కోరు చేశాడనేదే ముఖ్యం’’ అని వాషింగ్టన్‌ సుందర్‌ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.

పంత్‌పై సానూభూతి!
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ యువ బ్యాటర్‌ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. నెటిజన్లు అతడిని మరోసారి ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. 

‘‘రిషభ్‌ పంత్‌పై ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ స్థాయిలో విద్వేషం చిమ్మడాన్ని నమ్మలేకపోతున్నా’’ అని ఈ మాజీ బ్యాటర్‌ అన్నాడు. కాగా టీ20 ఫార్మాట్‌లో రిషభ్‌ పంత్‌ వరుసగా విఫలమవుతున్నప్పటికీ వన్డేల్లో మాత్రం అతడి ఆట తీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు.

పర్లేదు.. మరీ అంత చెత్తగా ఏమీ లేదు
ఈ ఏడాది ఇంగ్లండ్‌ మీద 125(నాటౌట్‌), వెస్టిండీస్‌ మీద అర్ధ శతకం(56).. సౌతాఫ్రికాతో విలువైన 85 పరుగులతో జట్టు గెలుపులో పాలుపంచుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌ వన్డేలో 125 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ పంత్‌ హేటర్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు అతడి అభిమానులు. 

చదవండి: Ind Vs NZ 1st ODI: కివీస్‌ గడ్డపై శ్రేయస్‌ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా! వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయమంటూ..
IND vs NZ: శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు.. సచిన్‌, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

>
మరిన్ని వార్తలు