Shikhar Dhawan: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం! అంత మాత్రానికి..

24 Nov, 2022 11:57 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌ (PC: BCCI)

New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan: జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు తాను వెనుకాడబోనని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ స్పష్టం చేశాడు. సారథిగా మునుపటి కంటే ఇప్పుడు ఎంతో పరిణతి సాధించానని.. కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని పేర్కొన్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో ఈ వెటరన్‌ ఓపెనర్‌ భారత వన్డే సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వెస్టిండీస్‌ గడ్డపై వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ధావన్‌.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ధావన్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కెప్టెన్‌గా ఇటీవల నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడం గురించి ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గబ్బర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా..
‘‘కెప్టెన్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ నమ్మకంగా నిర్ణయాలు తీసుకోగలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట్లో అయితే, బౌలర్‌ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా అతడితో అదనపు ఓవర్‌ వేయించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నేను ఇప్పుడు పరిణతి సాధించాను. ఒకవేళ ఓ బౌలర్‌ ఎంత ప్రయత్నించినా వికెట్‌ దొరకపోగా.. బ్యాటర్‌ పదే పదే బంతిని బాదుతున్నాడునుకోండి..

వెంటనే సదరు బౌలర్‌ దగ్గరకు వెళ్లకూడదు. ఎందుకంటే కచ్చితంగా అతడు అప్పుడు చిరాగ్గా ఉంటాడు. అందుకే కాసేపైనా తర్వాత అతడి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తప్పిదాల గురించి చెప్పాలి. సారథిగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ ఇలాంటివి అర్థమవుతూ ఉంటాయి. ఏదేమైనా.. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా జట్టు ప్రయోజనాల కోసం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల స్థాయికి నేను చేరుకున్నా.

అదే నా లక్ష్యం
ఒక కెప్టెన్‌గా జట్టును బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ వారి నుంచి అనుకున్న ఫలితాలు రాబట్టేలా ముందుకు సాగాల్సి ఉంటుంది’’ అని శిఖర్‌ ధావన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక కెప్టెన్‌ అయినంత మాత్రాన తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదన్న గబ్బర్‌.. ‘‘ఇలాంటి బాధ్యతలు వస్తూపోతూ ఉంటాయి. కాబట్టి నేను వీటి గురించి ఎక్కువగా ఆలోచించను.

వచ్చేటపుడు ఏమీ తీసుకురాలేదు కదా!
ఈ ప్రపంచంలోకి వచ్చేటపుడు మనమేమీ తీసుకురాలేదు. అలాగే వెళ్లేటపుడు ఏమీ తీసుకుపోలేము. చివరకు అన్నీ ఇక్కడే వదిలేయాలి కదా! అందుకే కెప్టెన్సీ చేజారుతుందేమోనని నేనెప్పుడూ భయపడను. బాధపడను’’ అని వేదాంత ధోరణి అవలంబించాడు. అదే విధంగా.. ‘‘కెప్టెన్‌గా ఉన్నంత మాత్రాన నేనేమీ మరీ ఒత్తిడిలో కూరుకుపోను.

జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా నా వంతు బాధ్యత కచ్చితంగా నెరవేర్చడంపైనే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది’’ అని ధావన్‌ స్పష్టం చేశాడు. కాగా శుక్రవారం (నవంబరు 25) టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక టీ20 సిరీస్‌ను హార్దిక్‌ పాండ్యా సేన 1-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్‌ పేసర్‌ ఎంట్రీ! సంజూ కూడా
Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!

మరిన్ని వార్తలు