Kane Williamson: ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసింది.. ఇక్కడ మాత్రం వదల్లేదు; కేన్‌ మామ చర్య వైరల్‌

16 Nov, 2022 16:34 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో వెనుదిరిగిన టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు టి20 సిరీస్‌కు సిద్ధమయ్యాయి. హార్దిక్‌ పాండ్యా నేతృత​ంలోని టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకుంది. ఇక నవంబర్‌ 18న ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ క్రమంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ మామ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

విషయంలోకి వెళితే.. ట్రోఫీతో ఫోటోలకు ఫోజిచ్చిన అనంతరం టీమిండియా కెప్టెన్‌ హార్దిక పాండ్యా ఇన్‌షర్ట్‌ను సరి చేసుకునే పనిలో ఉన్నాడు. ఇంతలో గాలి బలంగా వీయడంతో టేబుల్‌ కదిలి ట్రోఫీ కింద పడబోయింది. వెంటనే కేన్‌ విలియమ్సన్‌ కిందపడిపోతున్న ట్రోఫీని తన చేతుల్లోకి తీసుకున్నాడు.  అయితే ట్రోఫీ తిరిగి టేబుల్‌పై పెట్టడానికి మనసొప్పని కేన్‌ మామ నవ్వుతూ ట్రోఫీని నాతో తీసుకుపోతా.. అంటూ పేర్కొన్నాడు. ఈ చర్యతో అక్కడే ఉన్న హార్దిక్‌ పాండ్యా సహా ఫోటోగ్రాఫర్లు నవ్వుల్లో మునిగిపోయారు.

ఇక టి20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే ప్రారంభమవుతున్న టి20 సిరీస్‌కు విలియమ్సన్‌ సారధ్యంలోని న్యూజిలాండ్‌ జట్టు గప్టిల్‌, బౌల్ట్‌ మినహా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వగా.. హర్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువజట్లు న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది.

ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్‌-2023 మినీ వేలం నేపథ్యంలో మంగళవారం ఆయా ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, వదిలేసే ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా సేవలు అందించిన కేన్‌ విలియమ్సన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ ఉద్వాసన పలికింది. గత వేలంలో 14 కోట్ల భారీ ధరకు కేన్‌ విలియమ్సన్‌ను కొనుగోలు చేసింది. అయితే, కేన్‌ మామ సారథ్యంలోనూ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇందుకు తోడు గత కొంతకాలంలో పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించడం లేదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కేన్‌ విలియమ్సన్‌ను రిలీజ్‌ చేసింది. 

ఇది చూసిన అభిమానులు.. తాజాగా ట్రోఫీని తన చేతితో ఒడిసిపట్టుకోవడానికి లింక్‌ చేస్తూ.. ''ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసినా ఇక్కడ మాత్రం వదల్లేదు.. కేన్‌ మామ అంటే ఇది'' అంటూ ​కామెంట్‌ చేశారు.

చదవండి: Kane Williamson: నన్ను రిలీజ్‌ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో

మరిన్ని వార్తలు