Ishan Kishan: అప్పుడే తొలిసారి ధోనిని చూశా..! నా జెర్సీ నెంబర్‌ సీక్రెట్‌ ఏమిటంటే?

26 Jan, 2023 16:43 IST|Sakshi
ఇషాన్‌ కిషన్‌ (PC: BCCI)

India vs New Zealand T20 Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాంచి వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. కాగా టీమిండియా యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్‌కు ఆడతాడన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కివీస్‌తో రాంచిలో తొలి టీ20 నేపథ్యంలో బీసీసీఐ ఇంటర్వ్యూలో ఇషాన్‌ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. తన జెర్సీ నెంబర్‌ వెనుక రహస్యం సహా తనకిష్టమైన వంటకాలు, రాంచి డైనమైట్‌ ధోనితో అనుబంధం తదితర విషయాల గురించి చెప్పాడు.

నంబర్‌ 23 కావాలనుకున్నా
‘‘నా జెర్సీ నంబర్‌ 23 ఉండాలని కోరుకున్నా. కానీ అప్పటికే కుల్దీప్‌ యాదవ్‌ అదే నంబర్‌ ఎంపిక చేసుకున్నాడు. దీంతో నేను మరో ఆప్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే మా అమ్మకు ఫోన్‌ చేసి.. తన అభిప్రాయం అడిగాను.

32 నంబర్‌ ఉంటే తీసుకోమని చెప్పింది. అందుకు గల కారణాన్ని నేను అడగాలనుకోలేదు. అమ్మ మాట మీదుగా జెర్సీ నంబర్‌ను 32గా ఫిక్స్‌ చేసుకున్నా’’ అని ఇషాన్‌ పేర్కొన్నాడు.

ఇప్పటివరకైతే
‘‘14 ఏళ్ల వయసులో.. బిహార్‌ నుంచి జార్ఖండ్‌కు మా కుటుంబం షిఫ్ట్‌ అయినపుడే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఎదగాలని నిశ్చయించుకున్నా. తొలతు అండర్‌ 19.. ఆ తర్వాత టీమిండియాకు ఆడాలనేది నా కోరిక. ఈ సుదీర్ఘ ప్రయాణలో ఇప్పటి వరకు నేను కోరుకున్నవన్నీ దక్కాయి’’ అని ఇషాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. 

అవే గొప్ప క్షణాలు
ఇక 18 ఏళ్ల వయసులో తొలిసారి ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాన్న ఇషాన్‌ కిషన్‌.. ధోనిని నేరుగా క్షణాలు తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నాడు. కష్టాలకు భయపడే తత్వం తనది కాదని.. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తనకు జపనీస్‌ వంటకాలంటే ప్రాణమన్న ఇషాన్‌.. రోజూ వాటినే పెట్టినా హాయిగా తినేస్తానంటూ సరాదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

చదవండి: IND VS NZ T20 Series: టీమిండియాకు భారీ షాక్‌.. గాయం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ ఔట్‌
Rajat Patidar: అలా అయితే ఇషాన్‌ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ..

మరిన్ని వార్తలు