ఓ వానా... ఇక ‘డ్రా’నేనా?

22 Jun, 2021 04:56 IST|Sakshi
రోహిత్, రహానే, పుజారా

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రతికూల పరిస్థితి

నాలుగో రోజు ఆట వర్షార్పణం

ఈ వానను ఆపలేం. ఒక విజేతను చూడలేం. ఫైనల్‌ ఆడుతున్న భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఇక ప్రపంచ టెస్టు చాంపియన్లే! ఒక రోజే ఆట మిగిలున్నా... ఇంకో రోజు (రిజర్వ్‌ డే) కలుపుకున్నా... మొత్తం 196 ఓవర్లు పూర్తిగా వేసినా... మిగతా మూడు ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యే అవకాశాలు తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో  ‘డ్రా’ తప్ప ఇంకో ఫలితం వచ్చేలా కనిపించడంలేదు.   

సౌతాంప్టన్‌: ఒక జట్టు ఓడే పరిస్థితి లేదు. మరో జట్టు గెలిచేందుకు అవకాశం కనిపించడంలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఫలితం వచ్చేలా లేదు. ఎందుకంటే నాలుగు రోజుల ఆటలో రెండు రోజుల్ని పూర్తిగా వర్షం తుడిచేసింది. ఇరు జట్లలో ఒక జట్టయితే ఇంకా తొలి ఇన్నింగ్స్‌నే పూర్తిగా ఆడలేదు. రెండేళ్లుగా ఉత్సాహంగా 9 జట్ల మధ్య జరిగిన డబ్ల్యూటీసీ చివరకు వాన చేతిలో ఓడేలా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ఈ ఫైనల్‌కు తొలుత వర్షమే ‘వెల్‌కమ్‌’ చెప్పింది. తొలిరోజు ఆటకు ‘నో’అంది. రెండో రోజు ఆట మొదలైనా... చాలాసేపు వెలుతురు కమ్మేసింది.

ఎట్టకేలకు మూడో రోజు బంతికి, బ్యాట్‌కు సమాన అవకాశం వచ్చింది. మొత్తానికి ఆట రక్తికట్టించింది. నాలుగో రోజుపై ఆశలు రేకెత్తించింది. తీరా సోమవారం పొద్దుపొడిచేసరికి సూరీడుని పక్కకు తప్పించిన వాన... చినుకులతో మైదానాన్ని తడిపేసింది. ఇక ఆటగాళ్లు ఆడాల్సిందిపోయి... ప్రేక్షకుల్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచే వానజల్లును తిలకించారు. ఇక అంపైర్లు చేసేందుకు ఏమీ లేక నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు గంటల పాటు వేచిచూసిన ఫీల్డు అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. వాన ఆగదా... ఆట చూడమా... అంటూ అప్పటిదాకా గొడుగులు పట్టుకొని నిరీక్షించిన ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.  

ఇక్కడా నిర్వహించేది!
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్వాకంపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రంగా ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆటగాడే ఇలాంటి వ్యాఖ్య చేయడం గమనార్హం. మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ మాట్లాడుతూ ‘నాకు చాలా బాధనిపిస్తుంది. అత్యంత ప్రాధాన్యమున్న ఫైనల్స్‌ను ఇంగ్లండ్‌లాంటి వేదికలపై నిర్వహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. యూఏఈలాంటి వేదికను ఎంచుకుని వుంటే బాగుండేది’ అని అన్నాడు. భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. 

మరిన్ని వార్తలు