Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్‌ రావాల్సిందే!

2 Feb, 2023 12:05 IST|Sakshi

India vs New Zealand, 3rd T20I- Shubman Gill: న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీతో విధ్వంసం.. టీ20 సిరీస్‌కు వచ్చేసరికి సీన్‌ రివర్స్‌.. తొలి రెండు మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు.. 7, 11. వెరసి వన్డేలు, టెస్టులకు పనికొస్తాడే తప్ప.. పొట్టి ఫార్మాట్‌కు సరిపోడంటూ విమర్శలు.. జట్టు నుంచి తప్పించాలని సూచనలు..

అయితే, వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఆఖరిదైన మూడో టీ20లో అద్భుత శతకం.. 63 బంతుల్లోనే 126 పరగులు(స్ట్రేక్‌ రేటు 200).. 12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఊచకోతతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఘనతను తన ఖాతాలోకి తర్జుమా చేసుకున్న వైనం.. దీనితో పాటు మరికొన్ని రికార్డులు..

అది కూడా క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌ సమక్షంలో.. హీరోచిత ఇన్నింగ్స్‌తో తన ఆరాధ్య క్రికెటర్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన తీరు సూపర్‌.. అవును.. మీరు ఊహించిన ఆ పేరు ఇదే.. శుబ్‌మన్‌ గిల్‌. టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణం.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
కివీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో కలిపి కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయిన గిల్‌.. అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో మాత్రం పరుగుల సునామీ సృష్టించాడు. మూడు ఫార్మాట్లకు తను సరిగ్గా సరిపోతానని బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానమిచ్చాడు. అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించి సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

సచిన్‌ ప్రశంసలు
తద్వారా అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ పంజాబీ బ్యాటర్‌. దీంతో శుబ్‌మన్‌ గిల్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ఇక అతడి ఆటను ప్రత్యక్షంగా వీక్షించిన సచిన్‌ టెండుల్కర్‌ సైతం.. ముచ్చటపడిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్‌ అంటూ గిల్‌ను ఆకాశానికెత్తాడు. 

ఇక శుబ్‌మన్‌ గిల్‌ ఇప్పటికే సచిన్‌ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా విజయాన్ని కీర్తిస్తూ.. గిల్‌, హార్దిక్‌ పాండ్యాలను ప్రశంసిస్తూ.. సచిన్‌ పోస్టుపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మురిసిపోతున్న ఫ్యాన్స్‌
‘‘గిల్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడంటే.. బీసీసీఐ సచిన్‌ను కచ్చితంగా ప్రతి మ్యాచ్‌కు తీసుకురావాల్సిందే! దేవుడి సమక్షంలో భక్తుడి అద్భుత ఇన్నింగ్స్‌.. నిజంగా ఇది సూపర్‌! అసలైతే టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత సచిన్‌తో గిల్‌కు సన్మానం చేయిస్తే ఇంకా బాగుండేది కదా!’’ అని ఫ్యాన్స్‌ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

సారా పేరుతో ముడిపెట్టి
మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా అహ్మదాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ టెండ్కులర్‌ చేతుల మీదుగా అండర్‌ 19 మహిళా ప్రపంచకప్‌ విజేత అయిన భారత జట్టుకు సన్మానం జరిగింది.  ఇదిలా ఉంటే.. సచిన్‌ తనయ సారాతో గిల్‌ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిల్‌ అత్యుత్తమంగా రాణించినప్పుడల్లా అతడి పేరును సారా, సచిన్‌తో ముడిపెడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు.

చదవండి: SA Vs Eng: అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్‌ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్‌
IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్‌ బయటపడ్డ బెయిల్స్‌! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి

మరిన్ని వార్తలు