IND Vs NZ: మెరిసిన శ్రీకర్‌ భరత్‌.. విశాఖలో సంబరాలు చేసుకుంటున్న అభిమానులు

28 Nov, 2021 11:59 IST|Sakshi

విశాఖ స్పోర్ట్స్‌ : విశాఖ వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. వాస్తవానికి తొలిరోజే ఆడాల్సిఉండగా సీనియర్‌ వికెట్‌కీపర్‌ వృదిమాన్‌ సాహా తుది 11 మంది ఆటగాళ్లలో స్థానం సాధించడంతో శ్రీకర్‌ భరత్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అనుహ్యంగా రెండోరోజు ఆటలో వృద్దిమాన్‌ మెడ కండరం పట్టేయడంతో అతని స్థానంలో మూడో రోజు ఆటకు శ్రీకర్‌ భరత్‌ బరిలో దిగాడు.

ఆకట్టుకున్న శ్రీకర్‌ భరత్‌ 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 67వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన తొలిబంతిని ఓపెనర్‌ యంగ్‌ ఆడగా... ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌గా వచ్చిన బంతిని భరత్‌ లోలెవల్‌లో ఒడిసి పట్టుకున్నాడు.  కానీ అంపైర్‌ ఔట్‌ ఇవ్వకపోవడంతో భారత్‌ రివ్యూకు వెళ్లింది. యంగ్‌ను ఔట్‌గా ప్రకటించడంతో భరత్‌కు కాట్‌బిహైండ్‌గా తొలి వికెట్‌ దొరికింది. 89వ ఓవర్‌లో అక్షర్‌ వేసిన బంతిని ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌గా టేలర్‌ ఇచ్చినా... భరత్‌ మిస్‌ అయ్యాడు. తిరిగి 94.3 ఓవర్‌లో అక్షర్‌ బంతినే టేలర్‌ ముందుకువచ్చి డిఫెండ్‌ చేసుకోబోయి వికెట్ల వెనుక కాట్‌ బిహైండ్‌గా భరత్‌కు దొరికిపోయాడు.

ఓపెనర్‌ లాథమ్‌ వికెట్ల వెనుక దొరికిపోయి భరత్‌కు తొలి స్టంపౌట్‌ ఆటగాడయ్యాడు. దీంతో ప్రత్యమ్నాయంగా బరిలోకి వచ్చిన విశాఖ కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ సత్తాచాటాడు. గతంలోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన భరత్‌ ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయినా నిరుత్సాహపడకుండా ఈసారి నేరుగా జాతీయ తుది జట్టులో ఆడేందుకే అవకాశాన్ని సుగమం చేసుకున్నాడు. శనివారం భారత్‌ తరఫున శ్రీకర్‌ భరత్‌ చేసిన మూడు డిస్మిసల్స్‌ అధికారిక టెస్ట్‌ లెక్కల్లోకి చేరకున్నా ప్రత్యమ్నాయ ఆటగాడిగా చక్కటి గుర్తింపు పొందాడు. ఇలా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని భరత్‌ అందిపుచ్చుకోవడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

చాలా థ్రిల్లింగ్‌గా వుంది... 
జాతీయ జట్టుకు టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడటమనేది కల. ఆ కల ఈరోజు నెరవేరింది. మూడోరోజు ఆట ఆరంభం నుంచే వికెట్ల వెనుక నిలబడటం...తొలి క్యాచ్‌ను, తొలి స్టంపౌట్‌ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. టీ20 సిరీస్‌ ప్రారంభం నుంచే జట్టుతో ఉన్నాను.  
– శ్రీకర్‌ భరత్,  వికెట్‌ కీపర్,బ్యాటర్‌

చదవండి: KS Bharat: ఒక్క వికెట్‌ పడగొట్టు అక్షర్‌.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్‌ చేస్తున్నావు! 

మరిన్ని వార్తలు