Ind Vs Nz 1st T20: 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... అయినా విజయం మనదే!

18 Nov, 2021 07:19 IST|Sakshi

భారత్‌కు ‘జై’

తొలి టి20లో భారత్‌ విజయం

ఐదు వికెట్లతో కివీస్‌ పరాజయం

సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ

శుక్రవారం రాంచీలో రెండో టి20

Ind Vs Nz T20 Series 2021: India Beat New Zealand By 5 Wickets Lead 1-0: కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌ మార్గనిర్దేశనంలో భారత క్రికెట్‌ జట్టు టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. బౌలింగ్‌లో అశ్విన్‌, భువనేశ్వర్‌ రాణించడంతో కివీస్‌ను కట్టడి చేసిన టీమిండియా... ఆపై సూర్యకుమార్, రోహిత్‌ల ప్రదర్శనతో లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఆఖర్లో కొంత పోటీనిచ్చినా న్యూజిలాండ్‌కు చివరకు ఓటమే ఎదురైంది.

జైపూర్‌: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను భారత్‌ విజయంతో మొదలు పెట్టింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.

అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.  

శతక భాగస్వామ్యం... 
భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే డరైల్‌ మిచెల్‌ (0) డకౌట్‌ కావడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. అయితే గప్టిల్, చాప్‌మన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. చహర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహా 15 పరుగులు రావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 41 పరుగులకు చేరింది. ధాటిగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్‌కు 77 బంతుల్లోనే 109 పరుగులు జోడించింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని విడదీసిన తర్వాత మిగతా కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత్‌ సఫలమైంది.

రాణించిన రోహిత్‌... 
ఛేదనలో రాహుల్‌ (15) ఆరంభంలోనే వెనుదిరిగినా... రోహిత్‌ తనదైన శైలిలో స్వేచ్ఛగా ఆడాడు. సౌతీ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను... బౌల్ట్‌ ఓవర్లోనూ వరుసగా 4, 4, 6 బాదాడు. మూడో స్థానంలో వచ్చిన సూర్య కూడా చక్కటి షాట్లతో కెప్టెన్‌కు సహకారం అందించాడు. ఫలితంగా 69 బంతుల్లోనే జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. 34 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో 16 పరుగుల వ్యవధిలో భారత్‌ 3 వికెట్లు చేజార్చుకోవడంతో కొంత ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతుల ముందే విజయం దక్కింది.
     
స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) శ్రేయస్‌ (బి) చహర్‌ 70; మిచెల్‌ (బి) భువనేశ్వర్‌ 0; చాప్‌మన్‌ (బి) అశి్వన్‌ 63; ఫిలిప్స్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 0; సీఫెర్ట్‌ (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 12; రవీంద్ర (బి) సిరాజ్‌ 7; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 4; సౌతీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164.  
వికెట్ల పతనం: 1–1; 2–110; 3–110; 4–150; 5–153; 6–162. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0– 24–2; దీపక్‌ చహర్‌ 4–0–42–1; సిరాజ్‌ 4–0– 39–1; అశి్వన్‌ 4–0–23–2; అక్షర్‌ 4–0–31–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) చాప్‌మన్‌ (బి) సాన్‌ట్నర్‌ 15; రోహిత్‌ (సి) రవీంద్ర (బి) బౌల్ట్‌ 48; సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 62; పంత్‌ (నాటౌట్‌) 17; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌతీ 5; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) రవీంద్ర (బి) మిచెల్‌ 4; అక్షర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 166. 
వికెట్ల పతనం: 1–50; 2–109; 3–144; 4–155; 5–160. బౌలింగ్‌: సౌతీ 4–0–40–1; బౌల్ట్‌ 4–0–31–2; ఫెర్గూసన్‌ 4–0–24–0; సాన్‌ట్నర్‌ 4–0–19–1; ఆస్టల్‌ 3–0–34–0; మిచెల్‌ 0.4–0–11–1. 

చదవండి: Mohammed Siraj: 52 మ్యాచ్‌ల తర్వాత బరిలోకి
Venkatesh Iyer: 'నా కల నెరవేరింది'.. వెంకటేశ్‌ అయ్యర్‌ ఎమోషనల్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు