Ind Vs Nz 1st T20- Deepak Chahar: రోహిత్‌ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్‌’లో ఓపెనర్‌గా దిగుతా

17 Nov, 2021 18:13 IST|Sakshi

Deepak Chahar hilariously wants to open the batting: పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమైంది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బుధవారం కివీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు ఇదే మొదటి సిరీస్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో వీరిద్దరి కాంబినేషన్‌ ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. 

ఇక సీనియర్లతో పాటు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన దీపక్‌ చహర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, ఆవేశ్‌ ఖాన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్షల్‌ పటేల్‌ వంటి యువ ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో తుదిజట్టులో ఎవరు ఆడతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. కాగా ఇప్పటికే రెగుల్యర్‌ ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఉండగా... ఒకవేళ తుదిజట్టులోకి ఎంపికైతే ఇషాన్‌ కిషన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌కు ఆ ఛాన్స్‌ ఇస్తారేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో దీపక్‌ చహర్‌ సోషల్‌ మీడియా షేర్‌ చేసిన పోస్టు, అందుకు జతచేసిన క్యాప్షన్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘ఈరోజు రాత్రి నా హోం గ్రౌండ్‌లో ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడేందుకు అంతా సిద్ధమైంది’’అంటూ చహర్‌ రోహిత్‌తో మాట్లాడుతున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. దీంతో.. బహుశా బౌలింగ్‌లో చహర్ఓ‌ పెనింగ్‌ చేస్తాడేమో అని కామెంట్లు చేస్తున్నారు. 

ఆగ్రాకు చెందిన దీపక్‌ చహర్‌ రాజస్తాన్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, కెరీర్‌ అంత సాఫీగా ఏమీ సాగలేదు. రాజస్తాన్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్‌ చాపెల్‌ దీపక్‌లో ఫాస్ట్‌బౌలర్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవని కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ 2010-11లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. 

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాయాలు వెంటాడినా.. చిక్కులను అధిగమించి.. 2018లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో వన్డేల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న దీపక్‌ చహర్‌ ఈ సీజన్‌లో జట్టు చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తన కెరీర్‌లో చహర్‌ ఇప్పటి వరకు మొత్తంగా 1686 పరుగులు చేశాడు. ఇందులో 166 ఫోర్లు, 74 సిక్సర్లు ఉన్నాయి.

చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్‌!
Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్‌ కావడమే ఎంతో సంతోషం!

మరిన్ని వార్తలు