IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్‌ ముందు కివీస్‌కు షాక్‌.. తప్పుకొన్న విలియమ్సన్‌.. ఎందుకంటే..

16 Nov, 2021 11:42 IST|Sakshi

IND vs NZ T20I Series 2021: Kane Williamson to Miss T20 Against India, Check Here: టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. సుదీర్ఘ కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టుకు దూరం కానున్నాడు. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత టెస్టు సిరీస్‌ నాటికి టీమ్‌తో మమేకం కానున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021లో న్యూజిలాండ్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చిన సారథిగా విలియమ్సన్‌ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే, విశ్వవిజేతగా నిలవాలన్న కేన్‌ బృందం ఆశలపై నీళ్లు చల్లి.. ఆస్ట్రేలియా  ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దీంతో కివీస్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే టీమిండియాతో సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో యూఏఈ నుంచి కివీస్‌ ఆటగాళ్లు జైపూర్‌కు చేరుకున్నారు. నవంబరు 17 నుంచి మొదలుకానున్న పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తర్వాత.. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి డబ్యూటీసీ టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర లిఖించిన విలియమ్సన్‌.. పూర్తిస్థాయిలో ఈ సిరీస్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నాడట.

స్వదేశంలో కొరకరాని కొయ్యగా మారే భారత జట్టుకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాడట. ఇందుకు తోడు గాయం కూడా వేధిస్తుండటంతో టీ20 సిరీస్‌కు దూరం కావాలని విలియమ్సన్‌ నిర్ణయించుకున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ తెలిపింది. కాగా టీ20 సిరీస్‌కు కేన్‌ విలియమ్సన్‌ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో టిమ్‌ సౌథీ సారథిగా పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇక టీ20 సిరీస్‌ నేపథ్యంలో రోహిత్‌ శర్మ తొలిసారి పూర్తిస్థాయిలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. మొదటి టెస్టుకు అజింక్య రహానే, రెండో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యం వహించనున్నారు.

టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు ఇదే:
టాడ్‌ ఆస్ట్లే, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, లోకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైలీ జెమీషన్‌, ఆడమ్‌ మిల్నే, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ(కెప్టెన్‌). 

చదవండి: Hardik Pandya: అవన్నీ ఉత్త పుకార్లే.. 5 కోట్లు కాదు.. ఆ వాచీ ధర కోటిన్నర మాత్రమే: పాండ్యా
Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్‌.. మనసులు గెలిచారు!

Poll
Loading...
మరిన్ని వార్తలు