Ind Vs NZ: ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ను తీసుకోండి.. పృథ్వీ షా కంటే బెటర్‌: టీమిండియా మాజీ ప్లేయర్‌

28 Jan, 2023 16:56 IST|Sakshi
ఉమ్రాన్‌ మాలిక్‌

India vs New Zealand T20 Series: ‘‘పేస్‌లో వైవిధ్యం చూపనంత వరకు ఉమ్రాన్‌ మాలిక్‌ ఈ ఫార్మాట్‌లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా తను కట్టర్లు వేయాలని భావించినట్లు అనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు.

న్యూజిలాండ్‌తో రాంచిలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ఒకే ఒక్క ఓవర్‌ వేసే అవకాశం వచ్చింది. దానిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌. 16 పరుగులు సమర్పించుకున్నాడు.

ఉమ్రాన్‌ను తప్పించండి
ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌.. జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పేస్‌లో వైవిధ్యం చూపలేకపోతున్నాడని, రెండో టీ20లో తనను తప్పించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. అతడి స్థానంలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. 

ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్‌తో ఒకే ఒక్క ఓవర్‌ వేయించారు. శివం మావికి కూడా 14 ఓవర్‌ వరకు బాల్‌ ఇవ్వలేదు. ఇద్దరు బౌలర్లతో కలిపి కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయిస్తున్నపుడు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకోవచ్చు కదా!

అతడే బెటర్‌
ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ శర్మ లేదంటే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. ఇక నా అభిప్రాయం ప్రకారం.. వీరిద్దరిలో జితేశ్‌ బెటర్‌ ఆప్షన్‌. లోయర్‌ ఆర్డర్‌లో చక్కగా బ్యాటింగ్‌ చేయగలడు ’’అని మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. 

కాగా శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో సంజూ శాంసన్‌ స్థానంలో విదర్భ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఎంపికైన 29 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు ఇంత వరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇక రాంచి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా లక్నోలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని పట్టుదలగా ఉంది.

చదవండి: Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్‌ ఎందుకు?
డబుల్‌ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం

మరిన్ని వార్తలు