మరోసారి దాయాదుల పోరు.. ఒకే గ్రూపులో భారత్‌- పాక్‌.. జై షా ప్రకటన.. కానీ..

5 Jan, 2023 15:15 IST|Sakshi

Asian Cricket Council- cricket calendars- India Vs Pakistan: ఆసియా క్రికెట్‌ టోర్నీకి సంబంధించి 2023-24 క్యాలెండర్‌ గురువారం విడుదలైంది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జై షా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పురుషుల ఆసియా కప్‌ ఈవెంట్‌ ఈ సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. 

కాగా మెగా టోర్నీలో దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇక శ్రీలంక కూడా ఇదే గ్రూపులో ఉండగా.. క్వాలిఫైయర్స్‌లో గెలిచిన జట్టు బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లతో చేరనుంది. ఈ మేరకు 2023- 24 క్రికెట్‌ క్యాలెండర్స్‌ పేరిట జై షా ట్వీట్‌ చేశారు.

అది మాత్రం చెప్పలేదు!
కాగా ఆసియా వన్డే కప్‌-2023 ఎప్పుడన్న విషయం చెప్పిన జై షా.. వేదిక గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి పాకిస్తాన్‌ ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్‌ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదంటూ జై షా గతంలో వ్యాఖ్యానించారు.

దీంతో బీసీసీఐ- పీసీబీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ బాస్‌ రోజర్‌ బిన్నీ- పీసీబీ చైర్మన్‌ నజీమ్‌ సేతీ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేయడం విశేషం.

పురుషుల ఛాలెంజర్స్ కప్‌తో ఆరంభం
ఇక కొత్త క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఆసియా టోర్నీ పురుషుల ఛాలెంజర్స్ కప్‌(వన్డే)తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటాయి. వీటిలో బహ్రెయిన్, సౌదీ అరేబియా, భూటాన్, చైనా, మయన్మార్, మాల్దీవులు, థాయిలాండ్, ఇరాన్‌ ఉండగా.. మరో రెండు జట్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఐదు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.

మార్చిలో మెన్‌స​ అండర్‌-16 రీజినల్‌ టోర్నమెంట్‌ జరుగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. ఇదిలా ఉంటే.. చాలెంజర్స్‌ కప్‌ విన్నర్‌, రన్నరప్‌ ఏప్రిల్‌లో జరిగే మెన్స్‌ ప్రీమియర్‌ కప్‌(వన్డే ఫార్మాట్‌)కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడతాయి.

ఇక జూన్‌లో వుమెన్స్‌ టీ20 ఎమెర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ జరుగనుంది. ఇందులో రెండు గ్రూపుల్లో నాలుగేసి జట్ల చొప్పున ఎనిమిది జట్లు ఉంటాయి. ఒక గ్రూపులో ఇండియా- ఎ, పాకిస్తాన్‌- ఎ, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ ఉంటాయి. మరో గ్రూపులో బంగ్లాదేశ్‌- ఎ, శ్రీలంక- ఎ, యూఈఏ, మలేషియా టీమ్‌లు ఉంటాయి. దీని తర్వాత మెన్స్‌ ఎమెర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ జరుగుతుంది.

మేజర్‌ టోర్నీ
ఇక వీటన్నిటిలో మేజర్‌ టోర్నీ అయిన పురుషుల ఆసియా వన్డే 2023 కప్‌ సెప్టెంబరులో జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు ఇండియా, పాకిస్తాన్‌, శ్రీలంక ఒక గ్రూపులో.. మరో గ్రూపులో అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, క్వాలిఫైయర్‌ జట్టు ఉంటుంది. మొత్తంగా 13 మ్యాచ్‌లు జరుగుతాయి. 


PC: Jay Shah Twitter/ ACC


PC: Jay Shah Twitter/ ACC

మరిన్ని వార్తలు