Ind Vs Pak: బాబర్‌ ఒక్కడిని అవుట్‌ చేస్తే సరిపోదు! ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం!

29 Aug, 2022 13:09 IST|Sakshi
బాబర్‌ ఆజం- టీమిండియా(PC: AP/BCCI)

Asia Cup 2022 India vs Pakistan: ‘‘బాబర్‌ను అవుట్‌ చేసిన తర్వాత.. పాకిస్తాన్‌ సగం జట్టును పెవిలియన్‌కు పంపామని మేము భావించలేదు. నిజానికి అతడు గొప్ప ఆటగాడే! అయితే, టెక్నికల్‌గా మేము మరో తొమ్మిది మందిని అవుట్‌ చేయాలి కదా!

ప్రత్యర్థి జట్టు బెస్ట్‌ బ్యాటర్‌ను అవుట్‌ చేసినంత మాత్రాన మేము రిలాక్స్‌ అవ్వలేదు. అయితే, కీలక బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడం సహా.. వారి ప్రణాళికలను చిన్నాభిన్నం చేశామని మాకు తెలుసు’’ అని టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు.

బాబర్‌ను అవుట్‌ చేసి..
ఆసియా కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట భారత బౌలర్లు పాక్‌ జట్టును 147 పరుగులకు ఆలౌట్‌ చేయగా.. ఛేజింగ్‌ ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా సిక్స్‌ బాది జట్టుకు విజయం అందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వికెట్‌ను భువీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

టెస్టులు మినహా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగ్రస్థానంలో ఉన్న బ్యాటర్‌ను త్వరగా అవుట్‌ చేయడం ద్వారా పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనానికి బాటలు పరిచాడు భువీ. తద్వారా పాక్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత షాబాద్‌ ఖాన్‌, అసిఫ్‌ అలీ, నసీం షా వికెట్లు తీసి మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భువీ మాట్లాడుతూ.. బాబర్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 

ఆ విషయం మర్చిపోయాము.. అయితే..
కానీ.. ఆ ఒక్కడిని అవుట్‌ చేసినంత మాత్రాన బాధ్యత తీరిపోయినట్లు భావించకుండా తమ ప్రణాళికలు పక్కాగా అమలు చేసి విజయం సాధించామని పేర్కొన్నాడు. ఇక గతేడాది ప్రపంచకప్‌ టోర్నీలో పాక్‌ చేతిలో పరాభవం గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘అప్పుడు ఏం జరిగిందో నిజంగా మేము పూర్తిగా మర్చిపోయాం. ఆటగాళ్లుగా గెలవడానికి ఎల్లప్పుడూ శాయశక్తులా కృషి చేస్తాం.

అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉంటాయని తెలుసు. కాబట్టి మిగితా పరాజయాలను దాయాది చేతిలో ఓటమితో పోల్చలేము. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మాకు తెలుసు’’ అని భువనేశ్వర్ కుమార్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ మొత్తంగా 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
చదవండిHardik Pandya: సిక్సర్‌తో హార్దిక్‌ ఫినిషింగ్‌! ‘టేక్‌ ఏ బో’ అన్న డీకే! వీడియో వైరల్‌
Asia Cup 2022: 'కూల్‌గా ఉండు కార్తీక్‌ భాయ్‌.. నేను ఫినిష్‌ చేస్తా'! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు