Asia Cup Ind Vs Pak: ‘కేవలం లక్‌ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు?

29 Aug, 2022 14:51 IST|Sakshi
టీమిండియా(PC: BCCI)

Asia Cup 2022 Ind vs Pak: ఆసియా కప్‌-2022 టోర్నీలో ఆదివారం నాటి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆఖరి వరకు అద్భుతంగా సాగిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన దాయాదుల పోరు టీ20 క్రికెట్‌లోని అసలైన మజాను అభిమానులకు అందించింది. 

ఇక హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రసవత్తరంగా జరిగిన పోరులో చిరకాల ప్రత్యర్థిపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. 

ఈ నేపథ్యంలో టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూనే.. ఆఖరి వరకు పోరాడిన పాకిస్తాన్‌ను సైతం అభినందిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్‌ జర్నలిస్టు మాత్రం భారత జట్టు విజయాన్ని అపహాస్యం చేసేలా ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. సొంత జట్టు  

చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ ముగిసిన తర్వాత అర్ఫా ఫిరోజ్‌ జేక్‌ అనే జర్నలిస్టు.. ‘‘ఈరోజు ఇండియా కంటే లక్ గొప్పగా క్రికెట్‌ ఆడింది. ఒకవేళ లక్‌ ఫేవర్‌ చేసి ఉండకపోతే ఇండియా.. పాకిస్తాన్‌ మీద గెలిచేదే కాదు. ఈరోజు ఇండియా కంటే పాకిస్తాన్‌ గొప్ప ప్రదర్శన కనబరిచింది’’ అని ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో సొంత దేశ అభిమానుల నుంచి కూడా అతడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

తనను ముల్తాన్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్న సోహైబ్‌ అనే ఓ ట్విటర్‌ యూజర్‌.. ‘‘ఈరోజు నుంచి బ్లాక్‌ చేస్తున్నా. నువ్వు స్పోర్ట్‌ జర్నలిజం వదిలేయడం బెటర్‌. ఏదో పిచ్చి స్ప్రిప్టులు రాసుకో’’ అంటూ ‍కౌంటర్‌ ఇచ్చాడు.

జమీల్‌ ఖాన్‌ అనే మరో నెటిజన్‌.. ‘‘నువ్వు మాట్లాడేది పూర్తిగా తప్పు. ఈరోజు ఇండియా అద్భుతంగా ఆడింది’’ అని పేర్కొన్నాడు. టీ20లలో టీమిండియా పాకిస్తాన్‌ మీద సుమారుగా 8 మ్యాచ్‌లు గెలిచింది.. అయినా నువ్వు లక్‌ గురించి మాట్లాడుతున్నావా అంటూ మరో ట్విటర్‌ యూజర్‌ సదరు జర్నలిస్టుకు చురకలు అంటించారు. ఇక మరికొంత మంది.. ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటుతుంటే నువ్వు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధిద్దామని అనుకుంటున్నావు. అసలేం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా అని ఏకిపారేస్తున్నారు.


చదవండి: Asia Cup 2022: జడ్డూ నీకు నాతో మాట్లాడటం ఇష్టమేనా? మంజ్రేకర్‌ ప్రశ్నకు ఆల్‌రౌండర్‌ ఆన్సర్‌ ఇదే!

>
మరిన్ని వార్తలు