Virat Kohli: కోహ్లి ఆట తీరుపై పాక్‌ మాజీ కెప్టెన్‌ విమర్శలు.. అతడు రోహిత్‌, సూర్యలా ఆడలేడంటూ..

3 Sep, 2022 16:48 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

Ex- Pakistan Captain Criticises Virat Kohli: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆట తీరుపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ విమర్శలు గుప్పించాడు. టీ20 ఫార్మాట్‌లో అతడు ఎప్పటికీ రోహిత్‌ శర్మ లేదంటే సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి ఆటగాడు కాలేడని వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా.. సమకాలీన క్రికెటర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు సాధించాడు.

అయితే, ఇటీవలి కాలంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి.. ఆసియా కప్‌-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 35 పరుగులు(34 బంతులు), హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు(44 బంతుల్లో- నాటౌట్‌) సాధించాడు.

కోహ్లి గొప్ప టీ20 ప్లేయర్‌ కాలేడు!
ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ షోలో మాట్లాడిన రషీద్‌ లతీఫ్‌.. కోహ్లిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లి ఎప్పటికీ గొప్ప ప్లేయర్‌ కాలేడని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ పవర్‌ ప్లేలో అద్భుతంగా ఆడతాడని.. కోహ్లి మాత్రం 30-35 బంతులు ఎదుర్కొన్న తర్వాత.. అప్పుడు హిట్టింగ్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాడన్నాడు.

ఈ మేరకు లతీఫ్‌ మాట్లాడుతూ.. ‘‘కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌లతో విరాట్‌ కోహ్లిని పోలుస్తాం. నిజానికి వీళ్లంతా టీ20లలో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే విరాట్‌ కోహ్లి వన్డేల్లో గొప్ప క్రికెటర్‌.. కానీ ఎప్పటికీ గొప్ప టీ20 ప్లేయర్‌ మాత్రం కాలేడు. రోహిత్‌ శర్మ లేదంటే సూర్యకుమార్‌ యాదవ్‌లా అస్సలు ఆడలేడు’’ అని చెప్పుకొచ్చాడు.

అదే విధంగా.. ‘‘30- 35 బంతులు ఎదుర్కొన్న తర్వాతే కోహ్లి హిట్టింగ్‌ ఆడటం మొదలుపెడతాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. అయితే, రోహిత్‌ శర్మ పవర్‌ ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబడతాడు. దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని లతీఫ్‌ పేర్కొన్నాడు.

అవును.. నిజమే!
కాగా అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 101 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తంగా 3402 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 94. అర్ధ శతకాలు 31. ఇక ఐపీఎల్‌లో 223 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 6624 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113. ఐదు శతకాలు, 44 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

మరోవైపు.. రోహిత్‌ శర్మ 134 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 3520 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. నాలుగు శతకాలు.. 27 అర్ధ శతకాలు సాధించాడు. ఐపీఎల్‌లో 227 మ్యాచ్‌లలో భాగమై... 5879 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 109. సాధించిన శతకాలు, అర్ధ శతకాలు వరుసగా 1, 40.

ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను ఉదాహరిస్తూ కోహ్లిని ఉద్దేశించి లతీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై కింగ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ‘‘అవును.. నిజమే.. కింగ్‌ కోహ్లి ఎప్పటికీ రోహిత్‌ శర్మ లేదంటే సూర్యకుమార్‌ యాదవ్‌ కాలేడులే’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఆసియా కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం(సెప్టెంబరు 4) టీమిండియా సూపర్‌-4 స్టేజ్‌లో మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చదవండి: Serena Wiliams: సలాం 'సెరెనా విలియమ్స్'‌‌.. నీ ఆటకు మేము గులాం
Virat Kohli: భార్య అనుష్కతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే!
Ind Vs Pak: హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే!

మరిన్ని వార్తలు