Ind Vs SA: పాం‍డ్యా, సంజూపై ద్రవిడ్‌ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా!

8 Jun, 2022 12:37 IST|Sakshi

India Vs South Africa T20 Series: ఐపీఎల్‌-2022లో భారత కెప్టెన్లు విజయవంతం కావడం పట్ల టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. సారథులుగా రాణించడం అంటే ఓ మెట్టు ఎక్కినట్లే అంటూ ప్రశంసించాడు. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌లో సీనియర్లు ధోని(సీఎస్‌కే), రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌)తో పాటు పలువురు భారత క్రికెటర్లు ఆయా జట్లకు సారథులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ పాండ్యా, రాజస్తాన్‌ రాయల్స్‌కు సంజూ శాంసన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయస్‌ అయ్యర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్‌ పంత్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌, పంజాబ్‌ కింగ్స్‌కు మయాంక్‌ అగర్వాల్‌ కెప్టెన్లుగా పనిచేశారు. ఈ క్రమంలో హార్దిక్‌ తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను టైటిల్‌ విజేతగా నిలపగా.. పద్నాలుగేళ్ల తర్వాత రాజస్తాన్‌ను సంజూ ఫైనల్‌కు చేర్చాడు.

ఇక కేఎల్‌ రాహుల్‌ సైతం తమ తొలి ఎడిషన్‌లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘‘నాకు తెలిసి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రాణించడం అంటే ఆటగాళ్లుగా ఒక మెట్టు ఎదిగినట్లే లెక్క. అది భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పాండ్యా ఎంతగానో ఆకట్టుకున్నాడు.

అతను మళ్లీ జట్టులోకి రావడం, బౌలింగ్‌ కూడా చేస్తుండటం సంతోషకరం. సామ్సన్, రాహుల్, శ్రేయస్‌ కూడా సారథులుగా మంచి లక్షణాలు ప్రదర్శించారు’ అని ద్రవిడ్‌ ప్రశంసించాడు. కాగా జూన్‌ 9న భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20 జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి దాదాపు అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి.

ప్రేక్షకులకు 27 వేల టికెట్లు అందుబాటులో ఉంచగా, మంగళవారం వరకు 94 శాతం టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తో వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ పునరాగమనం చేస్తుండగా.. సంజూ శాంసన్‌కు మాత్రం భారత జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడి ఫ్యాన్స్‌ సెలక్టర్ల తీరును విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs SA 2022: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. పూర్తి షెడ్యూల్‌, జట్ల వివరాలు!
Hardik Pandya: కలిస్‌, కోహ్లి, సచిన్‌ సర్‌ ఇష్టం... నా ఫేవరెట్‌ క్రికెటర్‌ మాత్రం ఆయనే! ఎందుకంటే!

మరిన్ని వార్తలు