-

Rishabh Pant: అయ్యో పంత్‌! ఒకే మ్యాచ్‌లో.. అరుదైన ఘనత.. అప్రదిష్ట కూడా!

10 Jun, 2022 10:50 IST|Sakshi
రిషభ్‌ పంత్‌- విరాట్‌ కోహ్లి(ఫైల్‌ ఫొటో- PC: AP)

Rishabh Pant- Virat Kohli: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో భారత్‌కు టి20ల్లో నాయకత్వం వహించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు రిషభ్‌ పంత్‌. దేశం తరఫున 43 టి20లు ఆడిన తర్వాత ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు ఈ అవకాశం దక్కింది. 24 ఏళ్ల 248 రోజుల వయసులో సారథిగా వ్యవహరించిన పంత్‌... సురేశ్‌ రైనా (23 ఏళ్ల 197 రోజులు) తర్వాత పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున కెప్టెన్సీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా  గుర్తింపు పొందడం విశేషం. 

కాగా దక్షిణాఫ్రికాతో మొదటి టీ20 సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించిన పంత్‌.. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. పంత్‌ కంటే ముందు విరాట్‌ కోహ్లి ఈ అప్రదిష్టను మూటగట్టుకున్నాడు. 

టీమిండియా డైనమిక్‌ కెప్టెన్‌గా పేరొందిన కోహ్లి 2017లో కాన్పూర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌కు తొలిసారి సారథిగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక తాజా దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ పంత్‌ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

అదే విధంగా ఆనాటి మ్యాచ్‌లో కోహ్లి 29 పరుగులు(26 బంతుల్లో 4 ఫోర్ల సాయం) సాధించగా.. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో పంత్‌ సైతం 29 పరుగులే(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో) చేయడం మరో విశేషం. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం తెంబా బవుమా బృందం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో గెలుపొంది వరుసగా 13వ విజయం సాధించి చరిత్ర సృష్టించాలన్న భారత్‌ జోరుకు బ్రేక్‌ వేసింది.  

టీమిండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మొదటి టీ20:
టాస్‌- దక్షిణాఫ్రికా- బౌలింగ్‌
భారత్‌ స్కోరు: 211/4 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ మిల్లర్‌(31 బంతుల్లో 64 పరుగులు)

చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్‌

మరిన్ని వార్తలు