Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్‌

10 Jun, 2022 08:52 IST|Sakshi

Ind Vs SA T20 Series- Rishabh Pant: ‘‘మేము మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. అయితే, ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్‌, వాన్‌డెర్‌ డసెన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. నిజానికి మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వికెట్‌ కాస్త స్లోగా ఉంది.

ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోయింది. మిల్లర్‌ను కట్టడి చేసేందుకు మేము బాగానే ప్రయత్నించాం. కానీ వికెట్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించింది. ఏదేమైనా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాము. అయితే, తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు.

కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ నేపథ్యంలో పంత్‌ ఆఖరి నిమిషంలో జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం(జూన్‌ 9) ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. టీమిండియా 211 పరుగుల భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డేవిడ్‌ మిల్లర్‌, డసెన్‌ విజృంభించడంతో పరాజయం తప్పలేదు.

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పంత్‌.. తమ బ్యాటింగ్‌ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, బౌలింగ్‌లో కాస్త తేలిపోయామని, వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించిందని పేర్కొన్నాడు. కాగా ఈ పరాజయంతో టీ20 ఫార్మాట్‌లో భారత్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది.

వరుసగా 13వసారి గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించాలన్న కల నెరవేరకుండా పోయింది. ఇక ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా తదితరులు దూరంగా ఉండగా.. మొదటి మ్యాచ్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు.

టీమిండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మొదటి టీ20:
టాస్‌- దక్షిణాఫ్రికా- బౌలింగ్‌
భారత్‌ స్కోరు: 211/4 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ మిల్లర్‌(31 బంతుల్లో 64 పరుగులు- నాటౌట్‌)
ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ స్కోరు: 16 బంతుల్లో 29 పరుగులు

చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్‌ రెండు ముక్కలయ్యింది

మరిన్ని వార్తలు