Rohit Sharma: రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. మొదటి టీమిండియా బ్యాటర్‌గా.. ఆ వెనుకే!

29 Sep, 2022 11:11 IST|Sakshi

India vs South Africa, 1st T20I- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టీ20 ఫార్మాట్‌లో ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విధ్వంసకర ఆట తీరుతో పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్‌ ఇప్పటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుడు సహా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌(176)గా రోహిత్‌ కొనసాగుతున్నాడు. 

హిట్‌మ్యాన్‌ చెత్త రికార్డు
అయితే, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ టీమిండియా ఓపెనర్‌గా డకౌట్‌గా వెనుదిరిగాడు. కగిసో రబడ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

రోహిత్‌ ఏకంగా..
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు డకౌట్‌ అయిన భారత క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు తొమ్మిదిసార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఇక జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో టీమిండియా మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(5 సార్లు) నిలవగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి 4 సార్లు డకౌట్‌ అయ్యాడు. 

అర్ష్‌, చహర్‌ అద్భుతం.. శుభారంభం..
ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చహర్‌ సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. ఆరంభంలోనే అర్ష్‌ మూడు, చహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టడంతో.. 106 పరుగులకే పరిమితమైంది పర్యాటక ప్రొటిస్‌ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్‌ రాహుల్‌(51), సూర్యకుమార్‌ యాదవ్‌(50) అర్ధ శతకాలతో రాణించడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లు:
రోహిత్‌ శర్మ- 9
కేఎల్‌ రాహుల్‌- 5
విరాట్‌ కోహ్లి- 4

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిం‍డియా అత్యంత చెత్త రికార్డు!
IND vs SA: చాహర్‌ అద్భుతమైన ఇన్‌ స్వింగర్‌.. ప్రోటీస్‌ కెప్టెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌

మరిన్ని వార్తలు