Ind Vs Sa 1st Test: అజహరుద్దీన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లి! అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఇంకా

27 Dec, 2021 09:54 IST|Sakshi

మనదే పైచేయి...

కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకం

రాణించిన మయాంక్, రహానే

తేలిపోయిన సఫారీ బౌలర్లు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 272/3

Ind Vs Sa Test Series: మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ విజయాన్ని ఈసారైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారత జట్టుకు శుభారంభం లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియాదే పైచేయిగా నిలిచింది. రెండో రోజూ మన బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయి మరిన్ని పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంటాం.

సెంచూరియన్‌: భారత బ్యాటర్స్‌ హవాతో దక్షిణాఫ్రికా పర్యటన మొదలైంది. ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో తొలిరోజు ఆటను భారత బ్యాట్స్‌మెన్‌ శాసించారు. మధ్యలో ఎన్‌గిడి ఎదురుదెబ్బలు ఎదురైనా... నిలకడైన బ్యాటింగ్‌తో పరుగుల జోరు కొనసాగింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (248 బంతుల్లో 122 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించగా... మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (123 బంతుల్లో 60; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సీనియర్‌ బ్యాటర్‌ రహానే (40 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం తొలిరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఎన్‌గిడి (3/45) ఒక్కడే రాణించాడు.  

ఓపెనింగ్‌ అదుర్స్‌... 
టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్‌ కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌లు సఫారీ సవాల్‌కు సాధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు సాధించారు. ముందుగా మయాంక్‌ జోరు కనబరిచాడు. రబడ, ఎన్‌గిడి, జాన్సెన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

మయాంక్‌ కంటే కాస్తా ఆలస్యంగా 21వ బంతికి ఖాతా తెరిచిన రాహుల్‌ క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పని చెప్పాడు. జాన్సెన్‌ వేసిన 10వ ఓవర్లో మయాంక్‌ మూడు బౌండరీలు బాదాడు. మళ్లీ 18వ ఓవర్‌ వేసిన జాన్సెన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ మిడాన్, కవర్స్‌ మీదుగా రెండు ఫోర్లు బాదాడు. తొలి సెషన్‌లో భారత బ్యాటర్లు పైచేయి సాధించగా, 83/0 స్కోరు వద్ద లంచ్‌కు వెళ్లారు. 

మయాంక్‌ ఫిఫ్టీ... 
రెండో సెషన్‌ మొదలవగానే మయాంక్‌ 89 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా 35వ ఓవర్లో 100 పరుగులను అధిగమించింది. రాహుల్‌... మల్డర్‌ వరుస ఓవర్లలో కొట్టిన బౌండరీలతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ దశలో ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. 41వ ఓవర్‌ వేసిన ఎన్‌గిడి రెండో బంతికి మయాంక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఊపులో ఎన్‌గిడి కీలకమైన పుజారా (0)ను డకౌట్‌ చేశాడు. దీంతో భారత్‌ వరుస బంతుల్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లి క్రీజులోకి రాగా జాగ్రత్తగా ఆడిన రాహుల్‌ 127 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. టీమిండియా స్కోరు 157/2 వద్ద రెండో సెషన్‌ ముగిసింది.  

రాహుల్‌ శతకం... 
టీ విరామం తర్వాత కూడా ఇటు రాహుల్, అటు కెప్టెన్‌ కోహ్లి నింపాదిగా ఆడటంతో దక్షిణాఫ్రికా బౌలర్లకు కష్టాలే తప్ప... వికెట్లయితే రాలలేదు. కేశవ్‌ 66వ ఓవర్లో రాహుల్‌ వరుసగా ఫోర్, సిక్స్‌ బాది సెంచరీ దిశగా సాగాడు. ఓపెనింగ్‌ జోడీ తర్వాత మరో పెద్ద భాగస్వామ్యం నమోదు కావడంతో సఫారీ బౌలర్లలపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో ఎన్‌గిడి... కోహ్లి (94 బంతుల్లో 35; 4 ఫోర్లు) వికెట్‌ను పడేయడం వారికి ఊరటనిచ్చింది.

ఆఫ్‌ స్టంప్‌ అవతలకు వెళ్తున్న బంతిని ఆడిన కోహ్లి స్లిప్‌లో మల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. 82 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే అండతో రాహుల్‌ 218 బంతుల్లో (14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 80.4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా కొత్తబంతి తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన సానుకూల ఫలితాన్ని అయితే అందిపుచ్చుకోలేకపోయింది.

విరాట్‌ కోహ్లి రికార్డు!
టెస్టుల్లో అత్యధికసార్లు టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు కోహ్లి 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించి 30 సార్లు టాస్‌ గెలిచాడు. అజహరుద్దీన్‌ (47 టెస్టుల్లో 29 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు.

వసీమ్‌ జాఫర్‌ (2007లో) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన రెండో భారతీయ ఓపెనర్‌గా రాహుల్‌ నిలిచాడు.

టెస్టుల్లో రాహుల్‌ ఏడు సెంచరీలు సాధించగా... అందులో ఆరు విదేశీ గడ్డపైనే చేశాడు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బ్యాటింగ్‌) 122; మయాంక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్‌గిడి 60; పుజారా (సి) పీటర్సన్‌ (బి) ఎన్‌గిడి 0; కోహ్లి (సి) మల్డర్‌ (బి) ఎన్‌గిడి 35; రహానే (బ్యాటింగ్‌) 40; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–117, 2–117, 3–199. బౌలింగ్‌: రబడ 20–5–51–0, ఎన్‌గిడి 17–4–45–3, జాన్సెన్‌ 17–4–61–0, మల్డర్‌ 18–3–49–0, కేశవ్‌ మహరాజ్‌ 18–2–58–0. 

చదవండి: Mayank Vs Lungi Ngidi: మయాంక్‌ అగర్వాల్‌ ఔట్‌ విషయంలో ఫ్యాన్స్‌ అసంతృప్తి

మరిన్ని వార్తలు