Ind Vs SA: రాంచీకి చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం; అక్కడ ప్రాక్టీసులో రోహిత్‌ సేన!

8 Oct, 2022 11:20 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌ (PC: BCCI Twitter)

India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియాకు.. వన్డే సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. లక్నో వేదికగా గురువారం(అక్టోబరు 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటిస్‌ చేతిలో ధావన్‌ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుబడింది.

ఈ నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలు గెలిచి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌ ఆడేందుకు రాంచీకి చేరుకుంది. జార్ఖండ్‌లోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆదివారం (అక్టోబరు 9) ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది.

ధావన్‌ సేనకు ఘన స్వాగతం
ఇందుకోసం రాంచీకి చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సహా కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులకు హోటల్‌ సిబ్బంది బొట్టుపెట్టి ఆహ్వానించగా.. అభిమానులు ఆటగాళ్లను విష్‌ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

ప్రాక్టీసులో తలమునకలైన రోహిత్‌ సేన
ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న విషయం తెలిసిందే. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది కూడా! ఇలా భారత ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత వినోదం లభించనుంది.

చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్‌ ఫుడ్‌ మానేశా! ఇకపై..

మరిన్ని వార్తలు