Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!

13 Jun, 2022 09:55 IST|Sakshi
టీమిండియా(PC: BCCI)

India Vs South Africa 2nd T20- Rishabh Pant Comments : టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ రెండో అర్ధ భాగంలో ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేస్తే బాగుండేదన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనైనా తప్పులు దిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలోని భారత యువ జట్టుపై వరుస విజయాలు సాధిస్తోంది. ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన తెంబా బవుమా బృందం.. కటక్‌లో ఆదివారం(జూన్‌ 12) జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించింది.

సఫారీ బౌలర్లు విజృ​ంభించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన భారత్‌.. ప్రొటిస్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ చెలరేగడంతో పరాజయం పాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2-0తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. 

‘‘మేము మరో 10-15 పరుగులు చేయాల్సింది. ఇక మొదటి 7-8 ఓవర్లలో భువీ, ఇతర ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కానీ, ఆ తర్వాత మేము రాణించలేకపోయాం. సెకండాఫ్‌లో వికెట్లు తీయాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో తేలిపోయాం. 

క్లాసెన్‌, బవుమా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో! ఇక ఇప్పుడు మేము మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని పంత్‌ వ్యాఖ్యానించాడు.

టీమిండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా రెండో టీ20:
టాస్‌: దక్షిణాఫ్రికా- తొలుత బౌలింగ్‌
భారత్‌ స్కోరు: 148/6 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2)
విజేత: 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హెన్రిచ్‌ క్లాసెన్‌(46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు)
ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ చేసిన స్కోరు: 7 బంతుల్లో 5 పరుగులు
భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌: శ్రేయస్‌ అయ్యర్‌(35 బంతుల్లో 40 పరుగులు)

చదవండి: Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మరిచిపోయారు


 

మరిన్ని వార్తలు