Ind Vs SA: శ్రేయస్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి.. తిలక్‌ ఇప్పుడే వద్దు! ఎందుకంటే..

13 Dec, 2023 14:01 IST|Sakshi
తిలక్‌ వర్మ- శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI)

South Africa vs India, 3rd T20I: సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ కీలక సూచనలు చేశాడు. తుది జట్టు కుర్పు ఎలా ఉండాలన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయాలని సూచించాడు.

వన్‌డౌన్‌లో అయ్యర్‌ను ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరిగింది.

పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరిగిన ఈ టీ20కి అనారోగ్య కారణాల దృష్ట్యా రుతురాజ్‌ గైక్వాడ్‌ దూరం కాగా.. స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌కు సైతం మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినివ్వడంతో హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అదే విధంగా ఈ మ్యాచ్‌తో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ వంటి సీనియర్లు కూడా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌, కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ అద్భుత ప్రదర్శనతో తమ జట్టుకు విజయం అందించారు.

ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం నాటి ఆఖరి టీ20 సిరీస్‌ విజేతను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఈఎస్‌ఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ను నంబర్‌ 3 బ్యాటర్‌గా చూడాలని కోరుకుంటున్నా.

ప్రస్తుత మ్యాచ్‌లో తిలక్‌ వర్మ వన్‌డౌన్‌లో వచ్చి బాగానే ఆడాడు. కానీ దీర్ఘకాలంలో అతడు నిలకడగా ఆడతాడా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి శ్రేయస్‌ అయ్యర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేస్తే ఐసీసీ టోర్నీ నాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది.

రెండో టీ20లో శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌ డకౌట్‌ కావడం ప్రభావం చూపింది. అయినప్పటికీ వాళ్లు మరో మ్యాచ్‌ కచ్చితంగా ఆడగలరు. మేనేజ్‌మెంట్‌ వాళ్లకు అవకాశం ఇస్తుందనే భావిస్తున్నా. అయితే, సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ కావడంతో మూడో టీ20లో రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. 

ఇక వరల్డ్‌కప్‌ నాటికి రోహిత్‌ శర్మ అందుబాటులో లేకుంటే హార్దిక్‌ పాండ్యాకే సారథిగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంజయ్‌ మంజ్రేకర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా రోహిత్‌ అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా పాండ్యా చేతికి టీ20 పగ్గాలు వచ్చాయి. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా గాయపడిన పాండ్యా కోలుకోకపోవడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

>
మరిన్ని వార్తలు