Ind Vs Sa 3rd Test: శెభాష్‌ బుమ్రా.. వారం రోజుల క్రితం చెత్త ప్రదర్శన.. ఇప్పుడేమో 5 వికెట్లతో చెలరేగి..

13 Jan, 2022 07:28 IST|Sakshi
PC: BCCI

బూమ్‌ బూమ్‌ బుమ్రా

Ind Vs Sa 3rd Test: దాదాపు వారం రోజుల క్రితం... రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి బుమ్రా చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై అతని బౌలింగ్‌ అస్త్రాలేవీ పని చేయకపోగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తేదీ మారింది, వేదిక మారింది. తాను అరంగేట్రం చేసిన న్యూలాండ్స్‌ మైదానంలో బుమ్రా మళ్లీ కదం తొక్కాడు.

పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టి పడేస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్‌ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉన్న టీమిండియా చేతిలో 8 వికెట్లున్నాయి. మ్యాచ్‌ మూడో రోజు గురువారం ఎంత స్కోరు సాధిస్తుందనే దానిపైనే టెస్టు, సిరీస్‌ ఫలితం ఆధారపడి ఉంది.

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్‌ (10), మయాంక్‌ (7) వెనుదిరగ్గా... కెప్టెన్‌ కోహ్లి (14 బ్యాటింగ్‌), పుజారా (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్‌ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్‌ పీటర్సన్‌ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.  

పీటర్సన్‌ అర్ధ సెంచరీ... 
తొలి ఓవర్లోనే వికెట్‌తో భారత్‌కు రెండో రోజు శుభారంభం లభించింది. బుమ్రా వేసిన రెండో బంతికే మార్క్‌రమ్‌ (8) క్లీన్‌బౌల్డ్‌ కాగా, కేశవ్‌ మహరాజ్‌ (25)ను ఉమేశ్‌ వెనక్కి పంపాడు. ఈ దశలో పీటర్సన్, వాన్‌ డర్‌ డసెన్‌ (21) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లంచ్‌ సమయానికి భారత్‌కు మరో వికెట్‌ దక్కలేదు. తర్వాతి సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా జోరు ప్రదర్శించారు. వాన్‌ డర్‌ డసెన్‌ను అవుట్‌ చేసి 67 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని ఉమేశ్‌ విడదీశాడు. ఆ తర్వాత షమీ ఓవర్‌తో భారత్‌కు మరింత పట్టు చిక్కింది.

క్రీజ్‌లో నిలదొక్కుకున్న తెంబా బవుమా (52 బంతుల్లో 28; 4 ఫోర్లు)ను, మరో రెండు బంతులకే కైల్‌ వెరీన్‌ (0) కూడా షమీ పెవిలియన్‌ చేర్చాడు. జాన్సెన్‌ (7)ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో రెండో సెషన్‌ ముగిసింది. విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి వరకు పోరాడిన పీటర్సన్‌ను బుమ్రా అవుట్‌ చేయగా, రబడ (15) చలువతో స్కోరు 200 దాటింది. చివరి వికెట్‌ కూడా తీసిన బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్క్‌రమ్‌ (బి) బుమ్రా 8; కేశవ్‌ మహరాజ్‌ (బి) ఉమేశ్‌ 25; కీగన్‌ పీటర్సన్‌ (సి) పుజారా (బి) బుమ్రా 72; వాన్‌ డర్‌ డసెన్‌ (సి) కోహ్లి (బి) ఉమేశ్‌ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమీ 28; వెరీన్‌ (సి) పంత్‌ (బి) షమీ 0; జాన్సెన్‌ (బి) బుమ్రా 7; రబడ (సి) బుమ్రా (బి) శార్దుల్‌ 15; ఒలీవియర్‌ (నాటౌట్‌) 10; ఎన్‌గిడి (సి) అశ్విన్‌ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్‌) 210. వికెట్ల పతనం: 1–10, 2–17, 3–45, 4–112, 5–159, 6–159, 7–176, 8– 179, 9–200, 10–210. బౌలింగ్‌: బుమ్రా 23.3– 8–42–5, ఉమేశ్‌ యాదవ్‌ 16–3–64–2, షమీ 16–4–39–2, శార్దుల్‌ 12–2–37–1, అశ్విన్‌ 9–3–15–0.

►బుమ్రా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే వచ్చాయి.  

►కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గావస్కర్, అజహర్‌ తర్వాత ఈ మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు

మరిన్ని వార్తలు