Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్‌.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్‌

14 Jan, 2022 11:27 IST|Sakshi
PC: Disney+ Hotstar(Twitter)

Ind Vs Sa 3rd Test- Virat Kohli Slammed Dean Elgar Goes Viral: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యవహరించిన తీరుకు సంబంధించిన మరో వీడియో వైరల్‌ అవుతోంది. ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ను ఉద్దేశించి కోహ్లి అన్న మాటలు స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి. ‘‘నేను చూస్తూ ఊరుకుంటానని నువ్వు అనుకుంటున్నావా’’ అంటూ కోహ్లి ఎల్గర్‌ను స్లెడ్జ్‌ చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కాగా వాండరర్స్‌ టెస్టులో గెలుపొంది.. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలన్న టీమిండియా ఆశలపై ఎల్గర్‌ నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి.. 1-1తో సిరీస్‌ను సమం చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో మూడో టెస్టు ఇరు జట్లకు మరింత కీలకంగా మారింది. ఈ క్రమంలో భారత జట్టు బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగడంతో.. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే పడింది.

శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో ఎనిమిది వికెట్లు పడగొడితేనే భారత్‌ మ్యాచ్‌ గెలవగలదు. అయితే, మూడో రోజు పీటర్సన్‌, ఎల్గర్‌ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసి ప్రొటిస్‌కు శుభారంభం అందించారు. ఈ క్రమంలో అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ రివ్యూకు వెళ్లడం.. ఆ  తర్వాత బుమ్రా బౌలింగ్‌లో అవుట్‌ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కోహ్లి వ్యవహరించిన తీరు క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకర్షించింది.

కాగా తొలుత ఎల్గర్‌ డీఆర్‌ఎస్‌ కాల్‌తో తప్పించుకోవడంతో కోహ్లి పూర్తిగా సహనం కోల్పోయాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడటంతో.. ‘‘అస్సలు నమ్మలేకపోతున్నా... గత మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తి.. జస్‌ప్రీత్‌ నుంచి తప్పించుకుంటున్నాడు. 13 ఏళ్లుగా ఇదే చేస్తున్నావు డీన్‌... నన్ను సైలెంట్‌గా ఉంచగలనని నువ్వు అనుకుంటున్నావా? 2018లో జొహన్నస్‌బర్గ్‌ టెస్టు రద్దు కావాలని కోరుకున్నది ఎవరో మా అందరికీ తెలుసు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించాడు.

కాగా మూడేళ్ల క్రితం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా... వాండరర్స్‌ టెస్టులో 63 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించిన తర్వాత.. ఈ మ్యాచ్‌ను రద్దు చేసి ఉంటే బాగుండేదని ఎల్గర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోహ్లి ఎల్గర్‌ను స్లెడ్జ్‌ చేశాడు. ఇక ఎల్గర్‌ రివ్యూ విషయంలో కోహ్లి, అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌ అన్న మాటలు కూడా రికార్డైన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs Sa 3rd Test- Virat Kohli: వాళ్లిద్దరు బాగా ఆడారు.. అందుకే కోహ్లి అలా చేశాడు: దక్షిణాఫ్రికా బౌలర్‌

మరిన్ని వార్తలు