Elgar DRS Call Controversy: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్‌ కో..! 

15 Jan, 2022 17:28 IST|Sakshi

కేప్‌టౌన్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్‌ వివాదంలో టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 60 పరుగుల వద్ద ఎల్గర్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడం, ఆ వెంటనే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని నాటౌట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. 

ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి అండ్‌ కో(అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌).. దక్షిణాఫ్రికా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్ట్‌ సిరీస్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బహిరంగంగా ఆరోపించడంతో పాటు స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశారు.

మ్యాచ్ గెలవాలనుకుంటే సరైన పద్ధతులు ఎంచుకుంటే బెటర్‌ అని అశ్విన్ అనగా, మా పదకొండు మందిని ఔట్ చేసేందుకు దేశమంతా కలిసి ఆడుతున్నట్టుందని రాహుల్‌ కామెంట్‌ చేశాడు.  ఇదే సందర్భంగా కోహ్లి.. అందరూ చూస్తుండగా స్టంప్‌ మైక్‌ దగ్గరకు వచ్చి.. కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ  సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

థర్డ్‌ అంపైర్‌ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు  గాను ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లి అండ్‌ కో పై ఓ మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ సీరియస్‌గా తీసుకోకపోవడంతో కోహ్లి అతని సహచరులు నిషేధం ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోహ్లి అండ్‌ కో ను ఐసీసీ మందలించినట్లు తెలుస్తోంది. 
చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్‌..

మరిన్ని వార్తలు