Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్‌

23 May, 2022 13:20 IST|Sakshi
రిషభ్‌ పంత్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌(PC: BCCI)

India Vs South Africa T20 Series: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన తీరుపై టీమిండియా మాజీ బ్యాటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా పెదవి విరిచాడు. 18 మందితో కూడిన జట్టుతో ఆశించిన ఫలితాలు రాబట్టగలరా అని సందేహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఐదుగురు ఫాస్ట్‌బౌలర్లు, నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం బాగానే ఉన్నా.. వారందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడుతుందా అని ప్రశ్నించాడు.

వచ్చే నెల(జూన్‌) సొంతగడ్డపై టీమిండియా దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడననున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం ప్రకటించారు. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు.

ఐపీఎల్‌-2022లో ప్రదర్శన ఆధారంగా ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ తొలిసారి జట్టులో చోటు దక్కించుకోగా.. హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌ వంటి సీనియర్లు పునరాగమనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక తీరుపై ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘18 మంది సభ్యుల జట్టును సెలక్ట్‌ చేశారు. ఇందులో ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు, నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.

ఇంతపెద్ద జట్టును ఎంపిక చేసినపుడు మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేరు కదా! ఈ విషయంలో మీరు పశ్చాత్తాపపడక తప్పదు. కళ్ల ముందు ఎన్నో ఆప్షన్లు కనిపిస్తాయి. కానీ ఏదీ ట్రై చేసే అవకాశం రాకపోవచ్చు’’ అని సెలక్టర్లను ఉద్దేశించి ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే, కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ జట్టును ఎంపిక చేశారనుకున్నా.. ఇప్పుడు పరిస్థితులు కాస్త బాగానే ఉన్నాయి కదా అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా.. ఈ ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లకు జట్టులో స్థానం ఇచ్చారు. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా చాలా రోజుల తర్వాత డీకే పునరాగమనం చేయబోతున్నాడు. అయితే, అతడికి తుది జట్టులో చోటు దక్కదనిపిస్తోంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

చదవండి👉🏾IPL 2022 MI VS DC: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్‌ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు
చదవండి👉🏾Dinesh Karthik: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్‌

మరిన్ని వార్తలు