ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్‌ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

8 Jan, 2022 18:40 IST|Sakshi

Bumrah Warning To South Africa Players Recorded In Stump Mic: జొహానెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో విజయంతో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. కేప్‌ టౌన్‌ వేదికగా జనవరి 11న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. 

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌ నాలుగో రోజు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియా వైరలవుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా కొట్టిన ఓ బంతి హనుమ విహారి చేతికి బలంగా తాకడంతో ఫిజియో నితిన్ పటేల్ మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. ఈ సమయంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. సఫారీలను ఉద్దేశంచి చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. "ఎంత ఎగురుతారో ఎగరండి, మరో మ్యాచ్‌ ఉంది, మేమేంటో చూపిస్తాం.." అంటూ బుమ్రా చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


ఇదిలా ఉంటే, ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో టీమిండియా పేసు గుర్రం బుమ్రా కేవలం ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టి టీమిండియా అభిమానులను దారుణంగా నిరుత్సాహపరిచాడు. ఓ పక్క దక్షిణాఫ్రికా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుండగా భారత సీమర్లు మాత్రం నామమాత్రంగా రాణిస్తున్నారు. సఫారీ పేసర్లు రబాడా 13 వికెట్లు, మార్కో జన్సెన్ 12, ఎంగిడికి 11 వికెట్లు పడగొట్టగా.. భారత బౌలర్లు షమీ 11, శార్దూల్ ఠాకూర్ 10, అశ్విన్, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు