Ind Vs SA: ప్రొటిస్‌తో కీలక పోరు.. రాహుల్‌ స్థానంలో ఓపెనర్‌గా పంత్‌? బ్యాటింగ్‌ కోచ్‌ ఏమన్నాడంటే

29 Oct, 2022 14:58 IST|Sakshi

T20 World Cup 2022- India vs South Africa: టీ20 ప్రపంచకప్‌-2022 తొలి రెండు మ్యాచ్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్‌ చేరిన రాహుల్‌.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 9 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఈ కర్ణాటక బ్యాటర్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఓపెనింగ్‌ జోడీపై ప్రయోగం?
ఈ నేపథ్యంలో తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు ఉంటుందా? లేదా అనే సందేహాలు తలెత్తిన వేళ టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ స్పష్టతనిచ్చాడు. సూపర్‌-12లో భాగంగా ఆదివారం ప్రొటిస్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అతడికి.. భారత ఓపెనింగ్‌ జోడీ గురించి ప్రశ్న ఎదురైంది. రాహుల్‌ విఫలమవుతున్నాడు.. కాబట్టి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా రిషభ్‌ పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇస్తారా? అని విలేకరులు ప్రశ్నించారు.

బ్యాటింగ్‌ కోచ్‌ ఏమన్నాడంటే
ఇందుకు బదులుగా.. ‘‘అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లే జరిగాయి. అతడి(కేఎల్‌ రాహుల్‌) బ్యాటింగ్‌ బాగానే ఉంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు’’ అంటూ ఓపెనింగ్‌ జోడీని మార్చే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. పెద్దగా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చాడు. ఇక టీ20లలో దూకుడుగా ఆడటం మంచిదేనన్న విక్రమ్‌.. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్‌ స్వభావాన్ని బట్టి తమ ఆటగాళ్లు ముందుకు సాగుతారని  చెప్పుకొచ్చాడు.

ఏదో ఒకరోజైతే
ఇక జట్టులో పంత్‌ స్థానం గురించి స్పందిస్తూ.. ‘‘రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటగాడు. తను బాగా ఆడగలడని మాకు తెలుసు. తనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. మ్యాచ్‌ ఆడేందుకు ఎల్లప్పుడూ మానసికంగా.. శారీరకంగా దృఢంగా ఉండాలని చెబుతున్నాం. నెట్స్‌లో తను తీవ్రంగా సాధన చేస్తున్నాడు. త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని విక్రమ్‌ పేర్కొన్నాడు.

నిరాశలో పంత్‌ ఫ్యాన్స్‌
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ విషయంలో టీమిండియా రివ్యూకు వెళ్లి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఫినిషర్‌గా పునరాగమనం చేయడంతో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌కు ఈ టోర్నీలో ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కలేదు.

ఇక ఇప్పుడు బ్యాటింగ్‌ కోచ్‌ మాటలతో తదుపరి మ్యాచ్‌లో కూడా అతడికి అవకాశం ఉండకపోవచ్చనే సంకేతాలు వచ్చాయి. దీంతో పంత్‌ ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉంటే.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా గ్రూప్‌-2 టాపర్‌గా ఉంది. సెమీస్‌కు వెళ్లే మార్గం సుగమం చేసుకుంటోంది.

చదవండి: T20 WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’.. భారత్‌ నుంచి ఒక్కరికీ చోటు లేదు!
T20 WC 2022: దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా

Poll
Loading...
మరిన్ని వార్తలు