Happy Birthday David Miller: ఐపీఎల్‌లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్‌లు!

10 Jun, 2022 11:55 IST|Sakshi
డేవిడ్‌ మిల్లర్‌(PC: CA Twitter)

India Vs South Africa T20 Series: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ శుక్రవారం(జూన్‌ 10) 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రొటిస్‌ జట్టు భారత పర్యటనలో భాగంగా గురువారం నాటి తొలి టీ20 విజయంలో మిల్లర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 31 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

హ్యాపీ బర్త్‌డే మిల్లర్‌..
ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్‌ కొనసాగుతూనే ఉంటాయి అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా అతడిని విష్‌ చేసింది. కాగా ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. కీలక మ్యాచ్‌లలో జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ఫ్రాంఛైజీ ట్విటర్‌ వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపింది. రాజస్తాన్‌ రాయల్స్‌ సైతం అతడిని విష్‌ చేసింది.

అలా మొదలై..
దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో 1989, జూన్‌ 10న జన్మించిన డేవిడ్‌ మిల్లర్‌ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌(మే 20)తో అరంగేట్రం చేసిన ఈ ప్రొటిస్‌ ఆటగాడు.. ఆ తర్వాత రెండ్రోజులకే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి స్ట్రైకు రేటు 100కు పైగా ఉండటం విశేషం. అయితే, 12 ఏళ్లయినా ఈ హిట్టర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. 

ఉత్తమ బ్యాటర్‌.. అత్యుత్తమ ఫీల్డర్‌..
ఇక బ్యాటర్‌గానే కాకుండా మైదానంలో పాదరసంలా వేగంగా కదిలే ఫీల్డర్‌గానూ మిల్లర్‌కు పేరుంది. ఇప్పటి వరకు 96 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు 70 క్యాచ్‌లు పట్టాడు. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా అతడు రికార్డుకెక్కాడు. 

ఇక మొత్తంగా 378 మ్యాచ్‌లలో కలిపి మిల్లర్‌ అందుకున్న క్యాచ్‌ల సంఖ్య 235. వెస్టిండీస్‌ ఆటగాళ్లు కీరన్‌ పొలార్డ్‌(595 మ్యాచ్‌లలో 325 క్యాచ్‌లు), డ్వేన్‌ బ్రావో(534 మ్యాచ్‌లలో 252 క్యాచ్‌లు) అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

నాలుగో స్థానంలో..
ఐపీఎల్‌-2022లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ డేవిడ్‌ 16 ఇన్నింగ్స్‌లో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 94 నాటౌట్‌. అర్ధ శతకాలు 2. బాదిన బౌండరీలు 32. కొట్టిన సిక్సర్లు 23. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానం. ట్రోఫీ గెలిచిన జట్టులో మిల్లర్‌ సభ్యుడు. 

చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్‌
Rishabh Pant: అయ్యో పంత్‌! ఒకే మ్యాచ్‌లో.. అరుదైన ఘనత.. అప్రదిష్ట కూడా!

మరిన్ని వార్తలు