Hardik Pandya: ఎన్నెని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు!

11 Jun, 2022 12:10 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా(PC: BCCI)

హార్దిక్‌ పాండ్యా భావోద్వేగం

India Vs South Afrcia T20 Series: ‘‘నా పునరాగమనానికి ముందు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసు. అయితే, ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. కేవలం నా ఆట, ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టాను. ఆరు నెలల సెలవు కాలంలో నేను ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదు’’ అంటూ టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. తన రీ ఎంట్రీ వెనుక కఠిన శ్రమ దాగి ఉందని పేర్కొన్నాడు.

గడ్డు పరిస్థితులు దాటుకుని..
టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత ఐపీఎల్‌-2022 ఆరంభం వరకు హార్దిక్‌ పాండ్యా మైదానంలో దిగలేదన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ గత సీజన్‌, వరల్డ్‌కప్‌ టోర్నీలో వైఫల్యం తర్వాత అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాండ్యా పని అయిపోయింది అంటూ పలువురు విశ్లేషకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే, పాండ్యా మాత్రం సైలెంట్‌గా జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి విజయవంతమయ్యాడు. ఈ క్రంమలో ఐపీఎల్‌-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ హార్దిక్‌ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకోవడంతో అతడి దశ తిరిగింది.

చాంపియన్‌గా నిలిపి.. సగర్వంగా
సారథిగా గత అనుభవం లేకున్నా గుజరాత్‌ను ముందుకు నడిపించడంలో పాండ్యా సఫలమయ్యాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆకట్టుకుని తొలి సీజన్‌లోనే జట్టును ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిపాడు. దీంతో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌తో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులతో అజేయగా నిలిచాడు. ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసి 18 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో కటక్‌ వేదికగా జరిగే రెండో టీ20కి సన్నద్ధమవుతున్నాడు.

నాకు తెలిసింది అదే.. ఉప్పొంగిపోవడం లేదు..
ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘రోజూ తెల్లవారు జామున 5 గంటలకే నిద్ర లేచేవాడిని. ట్రెయినింగ్‌ సెషన్‌లో ఉన్నా తగినంత విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్తపడేవాడిని. ఆ నాలుగు నెలల పాటు రాత్రి తొమ్మిదిన్నరకే నిద్రపోయేవాడిని. ఎన్నెన్నో త్యాగాలు చేశాను. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు నాతో నేను పెద్ద యుద్ధమే చేశానని చెప్పవచ్చు.

అయితే, అందుకు తగ్గ ఫలితాలు రావడంతో పూర్తి సంతృప్తిగా ఉన్నా. వీటి కోసం నేను ఎంత కఠిన శ్రమకోర్చానో నాకే తెలుసు. నాకు మొదటి నుంచి కష్టపడటం అలవాటే.. ఫలితాల గురించి పెద్ద ఆలోచించేవాడిని కాదు. నిజాయితీగా నా పని చేసుకున్నా. అందుకే ఈ విజయాలకు ఉప్పొంగిపోవడం లేదు. ఈ క్షణం ఎలా ఉంది? తర్వాత ఏమవుతుందో తెలియదు కదా!

ఏదైనా ఒక్క రోజు, ఒక్క క్షణాకి సంబంధించి కాదు.. ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నదే అసలు విషయం’’ అని ఉద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్‌ జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్న హార్దిక్‌ పాండ్యా.. అక్కడ తనను తాను నిరూపించుకుంటాననని చెప్పుకొచ్చాడు.

చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేయద్దు: రవిశాస్త్రి

మరిన్ని వార్తలు