Ind Vs Sa Test Series: టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే!.. అందుకే ఎనిమిదోసారి కూడా..

15 Jan, 2022 10:28 IST|Sakshi
PC: CSA

దక్షిణాఫ్రికాదే ‘ఫ్రీడమ్‌’ 

దక్షిణాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాల గెలుపు కల నెరవేరలేదు... ఎనిమిదో ప్రయత్నంలోనూ టీమిండియా సిరీస్‌ సాధించడంలో విఫలమైంది. పైగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న జట్టు ఆ తర్వాత అనూహ్యంగా రెండు పరాజయాలతో సిరీస్‌ ఓటమిని మూటగట్టుకుంది. గత కొన్నేళ్లుగా జట్టు అద్భుత ప్రదర్శనలు...ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మన ఆట తీరు చూసిన తర్వాత బలహీనంగా కనిపిస్తున్న సఫారీ టీమ్‌ను ఓడించడం సులువనే సందేశంతో ఫేవరెట్‌గా కనిపించిన జట్టు చివరకు చేతులెత్తేసింది. బౌలర్లు అంచనాలకు తగిన రీతిలో సత్తా చాటినా... బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. అదే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

మరో వైపు స్టార్లు ఎవరూ లేకపోయినా సమష్టి తత్వంతో సఫారీ టీమ్‌ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సెంచూరియన్‌లో ఓడినా కుంగిపోకుండా పైకి లేచిన సఫారీ బృందం పట్టుదల, పోరాటస్ఫూర్తితో భారత్‌కు షాక్‌ ఇచ్చింది. చేతిలో 8 వికెట్లతో 111 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆటలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33.5 ఓవర్లలో ఆ పనిని పూర్తి చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే వికెట్‌ తీయగలిగిన భారత బృందం చివరకు నిరాశతో సిరీస్‌ను ముగించింది. 

Ind Vs Sa 3rd test: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 101/2 స్కోరుతో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కీగన్‌ పీటర్సన్‌ (113 బంతుల్లో 82; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడగా...వాన్‌ డర్‌ డసెన్‌ (95 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు), తెంబా బవుమా (58 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు.

తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న సఫారీ టీమ్‌ ‘ఫ్రీడమ్‌ ట్రోఫీ’ని సగర్వంగా అందుకుంది. బౌలర్ల ఆధిపత్యం సాగిన సిరీస్‌లో 3 అర్ధ సెంచరీలతో 276 పరుగులు చేసిన కీగన్‌ పీటర్సన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా కూడా నిలిచాడు.  ఇరు జట్ల మధ్య ఈ నెల 19నుంచి వన్డే సిరీస్‌ జరుగుతుంది.  

అలవోకగా లక్ష్యానికి... 
నాలుగో రోజు విజయాన్ని అందుకోవడంలో దక్షిణాఫ్రికాకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. పీటర్సన్‌ బాధ్యత తీసుకొని ముందుండి నడిపించగా... వాన్‌ డర్‌ డసెన్, బవుమా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 65 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పీటర్సన్, ఆ తర్వాతా చక్కటి షాట్లు కొట్టాడు. 12 పరుగుల వద్ద డసెన్‌ క్యాచ్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేసిన భారత్‌ ‘రివ్యూ’ కోరినా లాభం లేకపోయింది. ఆ తర్వాత 59 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో పుజారా వదిలేయడం కూడా సఫారీలకు కలిసొచ్చింది.

ఎట్టకేలకు 54 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం తర్వాత శార్దుల్‌ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని పీటర్సన్‌ నిష్క్రమించాడు. అయితే డసన్, బవుమా ఆ తర్వాత చక్కటి సమన్వయంతో ఆడుతూ మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 పరుగుల వద్ద శార్దుల్‌ బౌలింగ్‌లో డసెస్‌ ‘ఎల్బీ’ కోసం కూడా భారత్‌ రివ్యూ కోరినా...అంపైర్స్‌ కాల్‌తో బ్యాటర్‌ బతికిపోయాడు. లంచ్‌ సమయానికి స్కోరు 170 పరుగులకు చేరింది. విరామం తర్వాత భారత్‌ మరో వికెట్‌ తీయడంలో విఫలం కాగా, మిగిలిన 41 పరుగులు చేసేందుకు దక్షిణాఫ్రికాకు 8.3 ఓవర్లు సరిపోయాయి. అశ్విన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టి బవుమా చేసిన విజయనాదంతో సిరీస్‌ సఫారీల సొంతమైంది.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 210; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 198; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 16; ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 30; పీటర్సన్‌ (బి) శార్దుల్‌ 82; వాన్‌ డర్‌ డసెన్‌ (నాటౌట్‌) 41; బవుమా (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (63.3 ఓవర్లలో 3 వికెట్లకు) 212. 
వికెట్ల పతనం: 1–23, 2–101, 3–155.  
బౌలింగ్‌: బుమ్రా 17–5–54–1, షమీ 15–3–41–1, ఉమేశ్‌ 9–0–36–0, శార్దుల్‌ 11–3–22–1, అశ్విన్‌ 11.3–1–51–0.  

చదవండి: IND Vs SA 3rd Test: విరాట్‌ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..!

మరిన్ని వార్తలు