IND Vs SA: చివరి టెస్ట్‌కు ఇషాంత్‌..!

9 Jan, 2022 18:30 IST|Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మతో భర్తీ చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిరాజ్‌ స్థానానికి ఇషాంత్‌, మరో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. 100 టెస్ట్‌ల అనుభవం ఉందన్న కారణంగా కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ కోహ్లి.. ఇషాంత్‌వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. 

ఆఖరి టెస్ట్‌కు వేదిక అయిన కేప్‌టౌన్‌లో పిచ్‌ బౌన్స్‌కు సహకరించనుండడంతో అక్కడ ఇషాంత్‌ ఉపయోగకరంగా మారతాడని ద్రవిడ్‌ భావిస్తున్నాడట. బౌన్సీ పిచ్‌పై ఇషాంత్‌ హైట్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఆఖరి టెస్ట్‌ తుది జట్టులో అతన్ని ఆడించాలని ద్రవిడ్‌ ఫిక్స్‌ అయ్యాడట. 105 టెస్ట్‌ల్లో 311 వికెట్లు పడగొట్టిన ఇషాంత్‌.. తన చివరి టెస్ట్‌ను గతేడాది డిసెంబర్‌లో ఆడాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు. ఫలితంగా అతను దక్షిణాఫ్రికా సిరీస్‌లో డ్రెసింగ్‌ రూమ్‌కే పరిమితమ్యాడు. 

ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. సిరీస్‌ డిసైడర్‌గా నిలిచే మూడో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా, రెండో టెస్ట్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఎల్గర్‌ సేన సైతం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జనవరి 11 నుంచి ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది.   
చదవండి: IPL 2022: ఈ ఏడాది కూడా విదేశాల్లోనే..?

మరిన్ని వార్తలు