Trolls On Ruturaj Gaikwad: అసలేంటి రుతురాజ్‌ నువ్వు? నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. మరీ ఇలా చేస్తావా? పాపం..

20 Jun, 2022 11:49 IST|Sakshi
టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(PC: BCCI)

రుతురాజ్‌ గైక్వాడ్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!

Ind Vs SA 5th T20- Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘‘నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. మరీ ఎదుటి వ్యక్తి పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తావా? విషయమేదైనా కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా! నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. డగౌట్‌లో కూర్చున్న సమయంలో గ్రౌండ్స్‌మన్‌తో రుతురాజ్‌ వ్యవహరించిన విధానమే ఇందుకు కారణం.

ఇంతకీ విషయం ఏమిటంటే.. టీ20 సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య విజేతను తేల్చే నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌ బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా 3.3 ఓవర్లకే ఆట ముగిసిపోయింది. వాన తెరిపి ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా రుతురాజ్‌ డగౌట్‌లో కూర్చున్న సమయంలో ఓ గ్రౌండ్స్‌మన్‌ వచ్చి అతడి పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ రుతురాజ్‌ వెంటనే అతడిని దూరంగా నెట్టి పక్కకు జరుగమంటూ సైగ చేశాడు. కాస్త డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయ్‌ అన్నట్లుగా అసహనం ప్రదర్శించాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రుతురాజ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘అసలే కరోనా కాలం. కేసులు పెరుగుతున్నాయి. అందునా వర్షం పడుతున్న సమయంలో మ్యాచ్‌ కొనసాగుతుందో లేదోనన్న అనుమానాలు. అలాంటపుడు గ్రౌండ్స్‌మన్‌ అక్కడికి రావడం, సెల్ఫీ తీసుకోవడం అవసరమా?

రుతు.. ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉండడు. పరిస్థితుల ప్రభావం, విసుగు, చిరాకు తెప్పించి ఉంటాయి’’ అంటూ రుతురాజ్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ 15, రుతురాజ్‌ గైక్వాడ్‌ 10 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో 3.3 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 0, రిషభ్‌ పంత్‌ ఒక పరుగుతో క్రీజులో ఉండగా.. వరుణుడి ఆటంకం కారణంగా మ్యాచ్‌ రద్దైంది.

చదవండి: Rishabh Pant: ఆటగాడిగా, కెప్టెన్‌గా వందకు వంద శాతం.. ఏదేమైనా: పంత్‌ కౌంటర్‌!

మరిన్ని వార్తలు