KL Rahul: ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌... భవిష్యత్తులో అతడే కెప్టెన్‌.. అందుకే..

21 Dec, 2021 08:59 IST|Sakshi
PC: BCCI

కేఎల్‌ రాహుల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Saba Karim Praises KL Rahul: టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై మాజీ క్రికెటర్‌ సబా కరీం ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20, వన్డే, టెస్టు.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా అతడి ఎంపిక నూటికి నూరుపాళ్లు సరైందే అన్నాడు. టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో విరాట్‌ కోహ్లికి డిప్యూటీగా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. 

ఈ విషయంపై స్పందించిన మాజీ సెలక్టర్‌ సబా కరీం.. బీసీసీఐ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికా సిరీస్‌ నేపథ్యంలో ఆచితూచి.. అన్ని విధాలుగా ఆలోచించి కేఎల్‌ రాహుల్‌ను టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. విరాట్‌ కోహ్లికి కూడా రోహిత్‌ గైర్హాజరీలో ఇదే కరెక్ట్‌ ఛాయిస్‌. నిజానికి భవిష్యత్తులో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా తానేమిటో నిరూపించుకున్నాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ తన ముద్ర వేస్తున్నాడు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాయకుడిని తయారు చేసే పనిలో భాగంగానే ఈ నియామకం జరిగి ఉండవచ్చు’’ అని ఈ మాజీ వికెట్‌ కీపర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే రాహుల్‌ పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబరు 26 నుంచి భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. 

చదవండి:  SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్‌.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ
Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్‌... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే!

మరిన్ని వార్తలు