Dinesh Karthik: నాడు ‘బెస్ట్‌ ఫినిషర్‌’ ధోని ‘జీరో’.. డీకే సూపర్‌ షో! ఇప్పుడు కూడా

9 Jun, 2022 12:32 IST|Sakshi
నాడు దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌(PC: RCB)

India Vs South Africa 2022 T20 Series: డిసెంబరు 1.. 2006.. దక్షిణాఫ్రికాతో టీమిండియా మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌.. వేదిక జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్‌ స్టేడియం.. టాస్‌ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు గ్రేమ్‌ స్మిత్‌, లూట్స్‌ బోస్మన్‌ వరుసగా 16, 1 పరుగు చేసి పెవిలియన్‌ చేరారు.

వన్‌డైన్‌లో వచ్చిన హర్షల్‌ గిబ్స్‌ సైతం 7 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఏబీ డివిల్లియర్స్‌ 6, ఆల్బీ మోర్కెల్‌ 27, జొహన్‌ వాన్‌ డెర్‌వాత​ 21, రాబిన్‌ పీటర్సన్‌ 8, టైరన్‌ హెండర్సన్‌ 0, రోజర్‌ 5(నాటౌట్‌), చార్ల్‌ 0(నాటౌట్‌) పరుగులు చేశారు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్‌కు రెండు, శ్రీశాంత్‌కు ఒకటి, అజిత్‌ అగార్కర్‌కు రెండు, హర్భజన్‌కు ఒకటి.. అదే విధంగా సచిన్‌ టెండుల్కర్‌కు ఒక వికెట్ దక్కాయి.

దినేశ్‌ మోంగియా అభయమిచ్చాడు!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 34 పరుగులతో శుభారంభం అందించగా సచిన్‌ టెండుల్కర్‌ 10 పరుగులకే వెనుదిరిగాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన దినేశ్‌ మోంగియా 38 పరుగులు సాధించి విజయంపై విశ్వాసం పెంచాడు. అయితే అతడు ఈ స్కోరు నమోదు చేయడానికి 45 బంతులు తీసుకోవడం గమనార్హం.

దినేశ్‌ కార్తిక్‌ ఫినిష్‌ చేశాడు!
ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎస్‌ ధోని డకౌట్‌గా వెనుదిరగడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అంతలో నేనున్నానంటూ దినేశ్‌ కార్తిక్‌ ధైర్యం నింపాడు. 28 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

డీకేకు మరో ఎండ్‌లో సురేశ్‌ రైనా(3- నాటౌట్‌) సహకరించడంతో కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉండగా గెలుపు భారత్‌ సొంతమైంది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ సేన ప్రొటిస్‌ జట్టుపై విజయం సాధించింది. సుమారు 16 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యాచ్‌లో దినేశ్‌ కార్తిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

ఇక ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దినేశ్‌ కార్తిక్‌ ఇలాగే అద్భుతమైన ఫినిషింగ్‌ టచ్‌తో కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడ్డాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో డీకే అదరగొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 8 బంతుల్లోనే ఒక ఫోర్‌, 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు సాధించి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తద్వారా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇలా ఐపీఎల్‌లో ఆకట్టుకుని తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు నిదహాస్‌ ట్రోఫీ మ్యాచ్‌ హీరో. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూన్‌ 9 నాటి తొలి మ్యాచ్‌లో డీకే తుది జట్టులో స్థానం సంపాదించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ధోని స్కోరు అప్పుడు జీరో.. డీకే హీరో!
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ డీకేను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రొటిస్‌ జట్టుతో భారత్‌ మొదటి టీ20 విజయంలో అతడు ముఖ్య భూమిక పోషించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘2006లో దక్షిణాఫ్రికాతో టీమిండియా మొదటి టీ20.. ఈ మ్యాచ్‌లోభారత్‌ విజయంలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.. మన డీకేది కీలక పాత్ర. ఈరోజు కూడా అదే పునరావృతం కాబోతుంది! ఇంకా ఎదురుచూడటం మా వల్ల కాదు’’ అంటూ నాటి ఫొటోలు పంచుకుంది.

ఇది చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ‘వారెవ్వా డీకే.. నువ్వు సూపర్‌! ఆనాటి మ్యాచ్‌లో బెస్ట్‌ ఫినిషర్‌ ధోని ‘జీరో’.. ఇప్పటి ఫినిషర్‌ డీకే 31 నాటౌట్‌.. బాగుంది.. ఈరోజు కూడా నువ్వు బాగా ఆడాలి భయ్యా’’ అంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

చదవండి: KL Rahul-Rishabh Pant: జీర్ణించుకోలేకపోతున్నా.. రాహుల్‌ భావోద్వేగం! పంత్‌ ఏమన్నాడంటే!
PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌.. తొలి ఆటగాడిగా..!

మరిన్ని వార్తలు