Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా

31 May, 2022 17:04 IST|Sakshi

South Africa Tour of India- 2022: టీమిండియాతో టీ20 సిరీస్‌లో విజయం సాధిస్తామని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ తెంబా బవుమా విశ్వాసం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చినప్పటికీ కేఎల్‌ రాహుల్‌ సేనను తక్కువగా అంచనా వేయలేమని.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా భారత్‌తో సిరీస్‌ తమకు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా జూన్‌లో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టీమిండియా సారథిగా వ్యవహరించనున్నాడు.

ఈ క్రమంలో టీమిండియాతో సిరీస్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తెంబా బవుమా.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేంత లగ్జరీ మాకు లేదు. కానీ ఇండియా అలా కాదు. వాళ్లకు చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉన్నారు.

వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో ఇలాంటి జట్టుతో పోటీపడటం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియాతో సిరీస్‌ మాకు మేలు చేస్తుంది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఉన్నా.. టీమిండియా లాంటి బలమైన జట్టుతో పోటీ ఇప్పుడు మాకు చాలా అవసరం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 9 నుంచి భారత్‌- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

టీ20 సిరీస్‌: టీమిండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్‌ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

దక్షిణాఫ్రికా జట్టు: 
తెంబా బవుమా (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ,  ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.

చదవండి 👇
French Open: వరల్డ్‌ నంబర్‌ 1తో పోరులో ఓటమి.. నేను అబ్బాయినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల!

మరిన్ని వార్తలు