Ind Vs SA T20 Series: ఉమ్రాన్‌ మాలిక్‌పై సౌతాఫ్రికా కెప్టెన్‌ ప్రశంసలు! అతడు స్పెషల్‌.. కానీ..

7 Jun, 2022 14:16 IST|Sakshi
‍తెంబా బవుమా, ఉమ్రాన్‌ మాలిక్‌(PC: IPL)

India vs South Africa 2022 T20 Series: ‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్‌ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా! అయినప్పటికీ, అందుకు కచ్చితంగా సన్నద్ధమవుతారు. 

మా జట్టులో కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసరగల బౌలర్లు ఉన్నారు. మా అమ్ములపొదిలోనూ అస్త్రాలు ఉన్నాయి. అయితే, ఉమ్రాన్‌ మాలిక్‌ రూపంలో టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు. ఐపీఎల్‌లోని తన ప్రదర్శనను అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా’’ అని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ తెంబా బవుమా అన్నాడు.

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రతిభ ఉన్న ఆటగాడని ప్రశంసలు కురిపించాడు. అయితే, అతడిని ఎదుర్కొనేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ప్రొటిస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది.

ఈ క్రమంలో జూన్‌ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా మాట్లాడుతూ.. భారత్‌తో సిరీస్‌కు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అదే విధంగా ఈ సిరీస్‌తో తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. అతడిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌-2022లో ఉమ్రాన్‌ మాలిక్‌ 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన ఈ కశ్మీరీ ఆటగాడు ప్రొటిస్‌తో సిరీస్‌లో భారత తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన పరాభవానికి బదుల తీర్చుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది.

చదవండి: IND Vs SA: యార్కర్లతో అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. పాపం ఉమ్రాన్‌ మాలిక్‌..!

మరిన్ని వార్తలు