IND Vs SA Test Series 2021-22: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

14 Jan, 2022 18:34 IST|Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్‌ డిసైడర్‌ అయిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 


సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అన్నీ రంగాల్లో అద్భుతంగా రాణించి హాట్‌ ఫేవరెట్‌ అయిన టీమిండియాకు ఊహించని షాకి​చ్చింది. మరోవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్‌ మాత్రం ఆశించిన మేరకు రాణించలేక చతికిలబడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్‌ విభాగం దారుణంగా విఫలమై, సిరీస్‌ కోల్పోవడానికి పరోక్ష కారణమైంది. కేఎల్‌ రాహుల్‌, పంత్‌ మినహా ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు. సీనియర్‌ ఆటగాళ్లైన పుజారా, రహానేలు కెరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితులను ఈ సిరీస్‌లోనే ఎదుర్కొన్నారు. 


పేలవ ఫామ్‌లో ఉన్న 'పురానే'కు వరుస అవకాశాలు ఇచ్చిన టీమిండియా యాజమాన్యం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఈ ఇద్దరు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచారు. కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లను జారవిడిచి జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు వీరిపై విరుచుకుపడుతున్నారు. టీమిండియా సిరీస్‌ కోల్పోవడానికి వీరే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. 


'పురానే'కు వరుస అవకావాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఇకనైనా మేల్కోవాలని.. పుజారా, రహానేల కథ ముగిసిందని.. శ్రేయస్‌ అయ్యర్‌, విహారి, శుభ్‌మన్‌ గిల్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కేప్‌టౌన్‌ టెస్ట్‌లో రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43,9 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించకపోగా మ్యాచ్‌ కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు జారవిడిచారు. 
చదవండి: లడ్డు లాంటి క్యాచ్‌ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి

మరిన్ని వార్తలు