Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి

15 Jan, 2022 12:15 IST|Sakshi
PC: Disney+ Hotstar(Twitter)

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ డీఆర్‌ఎస్‌ కాల్‌ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్‌ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్‌ డారిల్‌.. భారత కెప్టెన్‌ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు.

ఇదిలా ఉంటే..  ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. షేన్‌ వార్న్‌ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్‌ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది.

నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చదవండి: 

A post shared by Fox Cricket (@foxcricket)

మరిన్ని వార్తలు