Ind Vs SA 3rd T20: వైజాగ్‌లో గ్రౌండ్‌ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే!

13 Jun, 2022 13:33 IST|Sakshi
రిషభ్‌ పంత్‌, ఉమ్రాన్‌ మాలిక్‌(PC: BCCI)

India Vs South Africa 3rd T20: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకుంది టీమిండియా. తద్వారా రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో వెనకబడిపోయింది. ఇక ఈ సిరీస్‌ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. 

లేదంటే సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చేజారుతుంది. అంతేగాక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ఇంత వరకు వరుస సిరీస్‌లు గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్‌ పడుతుంది.

ఇక ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు తేలిపోవడంతో 7 వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. రెండో మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం ప్రభావం చూపింది. ఇక బౌలర్లలో సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌(4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు.

అతడే ఎక్స్‌ఫ్యాక్టర్‌..
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ మూడో టీ20 తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడు టీమిండియాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన జహీర్‌ ఖాన్‌.. ‘‘తదుపరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ఆడించాలి.

అతడి ఎక్స్‌ట్రా పేస్‌ జట్టుకు ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనను మనమంతా చూశాము. టీ20 లీగ్‌లో ప్రొటిస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ఉమ్రాన్‌ అవుట్‌ చేసిన విధానం అమోఘం. తన వేగవంతమైన బంతితో మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. భారత జట్టులో ఉమ్రాన్‌ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

అందుకే ఉమ్రాన్‌ను జట్టులోకి తీసుకోవాలి!
ఇక టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 విశాఖపట్నంలోని వైఎస్సార్‌(డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం) స్టేడియంలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్‌ ఖాన్‌.. ‘‘అక్కడి మైదానం చిన్నది. కాబట్టి స్పిన్నర్లు ఒత్తిడిలో కూరుకుపోవచ్చు.

కాబట్టి ఉమ్రాన్‌ వంటి పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’  అని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్‌ 14న ఇరు జట్లు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌-2022లో 22 వికెట్లు పడగొట్టి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్‌ నేపథ్యంలో తొలిసారిగా టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాడు. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లలోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం.

చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!

మరిన్ని వార్తలు